అక్కడి పిల్లలని వాతలు పెట్టి చంపుతారు

posted on: Mar 11, 2016 11:54AM

 

అది ఒడిషాలోని నబరంగ్‌పూర్ జిల్లా. ఎటుచూసిన పేదరికం తాండవించే ఆ జిల్లాలో మూఢనమ్మకాలకు మాత్రం లోటు లేదు. అక్కడి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏదన్నా అనారోగ్యం ఏర్పడితే ముందుగా పరిగెత్తేది ఆసుపత్రికి కాదు... భూతవైద్యుడి దగ్గరకి! సదరు భూతవైద్యులు పిల్లలకు చిత్రవిచిత్రమైన వైద్యం చేస్తారు. పిల్లవాడి రాత బాగుండి బయటపడితే ఆ పేరు వైద్యుడితే, ఒకవేళ వైద్యం వికటించి పిల్లవాడు చనిపోతే అది తమ దురదృష్టంగా భావిస్తారు. అలాంటి ఒక మోటు వైద్య విధానమే కాల్చిన మేకుతో కానీ, గాజులతో కానీ వాత పెట్టడం. గత కొద్ది నెలలుగా నబరంగ్‌పూర్లో పదికి పైగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. వీరిలో కొందరు చనిపోయారు కూడా! తాజాగా మలిగూడ గ్రామానికి చెందిన ఓ నెల రోజుల పసికందు మరణం వార్తల్లోకి ఎక్కింది.

ఆ పిల్లవాడి పొట్ట మీద నరం పైకి తేలిందంటూ అతని తండ్రి ధనగౌడ స్థానిక భూత వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లాడు. భూత వైద్యుడు ఆ పిల్లవాడి పొట్ట మీద కాల్చిన మేకుతో వాత పెట్టడంతో అది కాస్తా పుండుగా మారింది. పరిస్థితి విషమించిన తరువాత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది. పిల్లవాడు చనిపోయాడు! నబరంగ్‌పూర్‌లో తరచూ ఇలాంటి సంఘటనలు జరగడంతో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తం కాక తప్పలేదు. ప్రస్తుతం వారు ‘జ్యోతి’ అనే 45 రోజుల ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నారు. గ్రామాల్లో ఉండే స్థానిక వైద్యులలో మోటైన వైద్యవిధానాల పట్ల అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం! మరి ప్రజల్లో మూఢనమ్మకాల సంగతో!

google-ad-img
    Related Sigment News
    • Loading...