హస్తం పార్టీదే హవా... పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడి!
posted on: Feb 11, 2026 6:24PM

తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం సాధించే దిశగా సాగుతోంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు నిర్వహించిన ఎన్నికలపై పీపుల్స్ పల్స్ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ సర్వేలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 శాతం మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోనున్నట్లు వెల్లడించింది.
మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, మహబూబ్‌నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ జోరు కొనసాగుతుందని పీపుల్స్ పల్స్ పేర్కొంది. మరోవైపు కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసింది. ఈ రెండు చోట్ల కాషాయ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించనుందని తెలిపింది.
అలాగే నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ కార్పొరేషన్లలో ఎంఐఎం ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించవచ్చని సర్వే పేర్కొంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ కూడా గెలిచే అవకాశం లేదని పీపుల్స్ పల్స్ స్పష్టం చేసింది.
కార్పొరేషన్ వారీగా అంచనాలు
రామగుండం: కాంగ్రెస్ 30–34, బీఆర్ఎస్ 16–20, బీజేపీ 3–6, ఇతరులు 4–7
మంచిర్యాల: కాంగ్రెస్ 39–43, బీఆర్ఎస్ 8–12, బీజేపీ 6–9, ఇతరులు 1–2
కొత్తగూడెం: కాంగ్రెస్ 28–34, బీఆర్ఎస్ 7–9, సీపీఐ 14–16, ఇతరులు 2–4
మహబూబ్‌నగర్: కాంగ్రెస్ 26–30, బీఆర్ఎస్ 18–22, బీజేపీ 6–8, ఎంఐఎం 2–4
నల్లగొండ: కాంగ్రెస్ 21–26, బీఆర్ఎస్ 8–12, బీజేపీ 6–10, ఎంఐఎం 2–4
నిజామాబాద్: కాంగ్రెస్ 10–16, బీఆర్ఎస్ 2–4, బీజేపీ 26–31, ఎంఐఎం 8–12
కరీంనగర్: కాంగ్రెస్ 14–16, బీఆర్ఎస్ 10–12, బీజేపీ 24–29, ఎంఐఎం 6–9
మున్సిపాలిటీలు – పార్టీ వారీగా అంచనాలు
116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ 68–76 మున్సిపాలిటీలను గెలుచుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. బీఆర్ఎస్‌కు 29–36, బీజేపీకి 3–5, ఎంఐఎంకు 0–1 మున్సిపాలిటీలు దక్కే అవకాశం ఉంది. మరో 8–14 మున్సిపాలిటీల్లో ‘నువ్వా నేనా?’ అన్నట్టుగా హోరాహోరీ పోటీ ఉందని అంచనా వేసింది.
ఓటు శాతం & వార్డుల అంచనాలు
కాంగ్రెస్: 36% ఓట్లు, 1210–1290 వార్డులు
బీఆర్ఎస్: 29.7% ఓట్లు, 860–930 వార్డులు
బీజేపీ: 19.3% ఓట్లు, 250–270 వార్డులు
ఎంఐఎం: 2% ఓట్లు, 35–44 వార్డులు
సీపీఐ: 12–17, సీపీఎం: 10–14, ఇతరులు: 90–110 వార్డులు
మొత్తంగా చూస్తే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో ముందంజలో నిలవనుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ వెల్లడిస్తోంది. అధికార పార్టీకే ప్రజలు మరోసారి పట్టం కట్టే సూచనలు కనిపిస్తున్నాయి.






