హమ్మయ్య.. ముంబై గెలిచింది!

posted on: Apr 21, 2026 8:08AM

ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సోమవారం (ఏప్రిల్ 21) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 99 పరుగుల భారీ తేడాతో   చిత్తు చేసి నాలుగు వరుస పరాజయాల తరువాత తొలి గెలుపును అందుకుంది. ఈ విజయం జట్టు సమష్టి ప్రదర్శనతో లభించింది.   అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన హార్థిక్ పాండ్యా సేన   కీలక విజయాన్ని నమోదు చేసింది.

తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు డికాక్ (13), మలేవార్ (2)తో పాటు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (15) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును యువ సంచలనం తిలక్ వర్మ తన అద్భుత బ్యాటింగ్ తో ఆదుకున్నాడు. నమన్ ధీర్   సహకారంతో ఇన్నింగ్స్ నిర్మించిన తిలక్, ఆ తర్వాత గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. నమన్ ధీర్ 45 పరుగులు చేశాడు. తిలక్ మర్మ అయితే.. కేవలం 45 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో  ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసింది.

200 పరుగుల భారీ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడింది. ఇన్నింగ్స్ తొలి బంతికే సాయి సుదర్శన్‌ను డకౌట్ చేయడం ద్వారా జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్‌లో తన తొలి వికెట్ సాధించాడు. . ఆ తర్వాత అశ్వని కుమార్ తన బౌలింగ్ పదును చూపిస్తూ గుజరాత్ బ్యాటింగ్ నడ్డి విరిచాడు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన గుజరాత్, కనీస పోరాటం కూడా ప్రదర్శించలేకపోయింది.

కెప్టెన్ శుభ్‌మన్ గిల్14 పరుగులు, జోస్ బట్లర్ 5 పరుగులు నిరాశపరచడంతో  గుజరాత్ పతనం వేగవంతమైంది. వాషింగ్టన్ సుందర్ 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచినప్పటికీ..  మిగిలిన బ్యాటర్లు  చేతులెత్తేయడంతో గుజరాత్ టైటాన్స్  15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్ 4 వికెట్లతో చెలరేగగా, సాంట్నర్, గజన్ఫర్ చెరో రెండు వికెట్లు తీశారు.

వరుసగా నాలుగు ఓటముల తర్వాత దక్కిన ఈ విజయం ముంబై ఇండియన్స్ శిబిరంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా బుమ్రా వికెట్ల ఖాతా తెరవడం, తిలక్ వర్మ భీకర ఫామ్‌లోకి రావడం జట్టుకు  సానుకూలాంశం.  

google-ad-img
    Related Sigment News
    • Loading...