Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాక్సింగ్ ఆలీ ఇక లేడు!
posted on: Jun 4, 2016 1:17PM
ప్రపంచంలోనే అతి ప్రసిద్ధ క్రీడాకారునిగా గుర్తింపు పొందిన మహమ్మద్ ఆలీ ఇక లేరు. 74 ఏళ్ల వయసులో ఆలీ శ్వాసకోస సంబంధ వ్యాధులతో ఇవాళ కన్నుమూశారు. బాక్సింగ్ ఆలీగా పేరు పొందిన ఆలీ జీవితం ఏ సినిమాకూ తీసిపోదు. ఆఫ్రికా మూలాలు కలిగిన ఆలీ, అమెరికాలో పుట్టినా, అక్కడి జాతి వివక్షను కూడా ఎదుర్కొన్నాడు. 12 ఏళ్ల వయసులో తన సైకిల్‌ను ఎవ్వరో కొట్టేయడంతో ఇక నుంచి అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు బాక్సింగ్ నేర్చుకుంటానంటూ పట్టుబట్టాడు ఆలీ. అలా బాక్సింగ్ పోటీల్లో అడుగుపెట్టినప్పటి నుంచీ ఆలీది ప్రభంజనమే! అదే సమయంలో టెలివిజన్లలో ప్రసారాలు కూడా వేగం పుంజుకోవడంతో... ప్రతి ఇంట్లోనూ ఆలీ బాక్సింగ్‌కు సంబంధించిన ప్రసారాలే కనిపించేవి. అలా ఆటను ఇంటింటి వినోదంగా మార్చిన ఘనత ఆలీదే! అలాగని ఆలీ ఏమీ హింసను ప్రోత్సహించే వ్యక్తి కాదు. ఆ మాటకు వస్తే... వియత్నాంతో అమెరికా యుద్ధానికి దిగినప్పుడు సైన్యంలో పాల్గొనకుండా యుద్ధాన్ని నిరాకరించాడు. దాంతో బాక్సింగ్ కెరీర్ దాదాపు నాశనమైపోయినా కూడా తన నిబద్ధత నుంచి వెనక్కి తగ్గనేలేదు.
ఆలీ క్రైస్తవుడే అయినప్పటికీ తరువాత కాలంలో ఇస్లాం మతం పట్ల ఆకర్షితుడయ్యాడు. తాను స్వయంగా ఇస్లాం మతాన్ని పుచ్చుకోవడమే కాకుండా, ఇస్లాంను స్వీకరించమంటూ మత ప్రచారాన్ని సైతం చేసేవాడు. ఆలీ తన కెరీర్లో 56 గెలుపులతో, కేవలం ఐదంటే ఐదు సార్లు ఓటమిని చవిచూశాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచితీరాలంటూ ఆలీ బలవంతంగా కాచుకున్న దెబ్బలే అతని ఆరోగ్యాన్ని నాశనం చేశాయి. గత ముప్ఫై ఏళ్లుగా ఆలీ పార్కిన్‌సన్స్ అనే నరాల వ్యాధితో బాధపడుతూ వచ్చాడు. శత్రువుల మీద ముష్టిఘాతాలను కురిపించిన ఆ చేతులు తరువాత కాలంలో వణికిపోయేవి. అతని సింహగర్జనలు కాస్తా గుసగుసల స్థాయికి చేరుకున్నాయి. ఏది ఏమైనా చివరి వరకూ కూడా బాక్సింగ్ అంటే ఆలీ, ఆలీ అంటే బాక్సింగ్ అన్న స్థాయిలో గుర్తింపు పొందాడు ఆలీ. ఆలీ లేకున్నా మానవ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని మిగిల్చి వెళ్లాడు.






