కారు ప్రయాణం పడలేదా!!

 

జి.వెంకటస్వామి తనయులుగా రాజకీయాల్లోకి ప్రవేశించి, సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న వి-బ్రదర్స్ వినోద్, వివేక్ మళ్లీ కారు దిగి, కాంగ్రెస్ గూటికి చేరాలని ప్రయత్నిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రం ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ జాప్యం చేస్తోందంటూ టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఈ బ్రదర్స్.. ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. వాస్తవానికి వాళ్లకు కాంగ్రెస్ పార్టీ పట్ల పెద్దగా వ్యతిరేకత లేకపోయినా, కిరణ్ కుమార్ రెడ్డితో పడకపోవడం వల్లే దూరమైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజా పరిస్థితుల్లో టీఆర్ఎస్ అధినాయకత్వం ఎంపీ వివేక్‌కు సిటింగ్ స్థానమైన పెద్దపల్లిని కేటాయించటానికి సిద్ధమైంది. వినోద్‌కు ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి అసెంబ్లీ సీటు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. అయితే బెల్లంపల్లి సీటును కాకుండా, అదే జిల్లా చెన్నూరు అసెంబ్లీ సీటును వినోద్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అక్కడ టీఆర్ఎస్ నుంచి నల్లాల ఓదెలు సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను కాదని చెన్నూరులో వినోద్‌కు టికెట్ ఇవ్వటం గులాబీ దళపతికి ఇష్టం లేనట్లు తెలుస్తోంది. బెల్లంపల్లిలో పోటీకి వినోద్ విముఖత చూపటానికి కారణం.. అక్కడ సీపీఐ సిటింగ్ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ తిరిగి పోటీ చేస్తుండటమేనని అంటున్నారు.

 

కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ పొత్తు ముగిసిన అధ్యాయమని కేసీఆర్ స్వయంగా ప్రకటించడంతోపాటు కాంగ్రెస్, సీపీఐ జట్టు కట్టే సూచనలు కూడా బెల్లంపల్లి సీటును వినోద్ వద్దటానికి మరో కారణమని చెబుతున్నారు. బెల్లంపల్లి కాకపోతే కరీంనగర్ జిల్లా చొప్పదండి అసెంబ్లీ సీటును వినోద్‌కు కేటాయించటానికి టీఆర్ఎస్ నాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయినా ఆయన చెన్నూరు కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇక, వివేక్ కూడా పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో తాను టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగితే.. మరో బలమైన అభ్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటే ఎలా అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఆయన ఒక సర్వే చేయించుకోగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తే వచ్చే ఓట్ల కంటే, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఎక్కువ ఓట్లు వస్తాయని తేలినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌లో కొనసాగటంపై కాకా తనయులు పునరాలోచనలో పడ్డారు.