నేడు తెరాస, రేపు తెదేపా వంతు

posted on: Jun 5, 2014 5:35PM

 

తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కి ఆంధ్ర ప్రజలను తిట్టడం ఇష్టమయితే, ఆయనను విమర్శించడం తెదేపా తెలంగాణా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులుకి చాలా ఇష్టం. కేసీఆర్ ని విమర్శించడానికి వచ్చిన ఏ అవకాశాన్ని ఆయన ఎన్నడూ వదులుకోలేదు. ఇక రైతుల రుణమాఫీలో కేసీఆర్ ప్రభుత్వం వెనకడుగు వేసినప్పుడు మాత్రం ఎందుకు ఊరుకొంటారు? ఈరోజు తెదేపా ప్రధాన కార్యాలయం యన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన “కేసీఆర్ వ్యవసాయ రుణాలన్నిటినీ మాఫీ చేస్తానని ప్రజలకు భూటకపు హామీలిచ్చి వారిని మభ్యపెట్టి ఎన్నికలలో గెలిచారు. ఇప్పడు అధికారం చేజిక్కించుకొన్నాక మాట మార్చడం ప్రజలను మోసం చేయడమే. అందువల్ల కేసీఆర్ ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగా మొత్తం వ్యవసాయ రుణాలన్నిటినీ బేషరతుగా మాఫీ చేయాలి. వ్యవసాయ రుణాలు ఒక్కటే కాదు, ఆయన ఇచ్చిన అన్ని హామీలను అమలుచేసి తీరాలి. లేకుంటే ఆయనను ప్రజలలో నిలదీస్తాను,” అని హెచ్చరించారు.

 

మోత్కుపల్లి ఆవిధంగా కోరడంలో తప్పేమీ లేదు. కేసీఆర్ ఇచ్చిన హామీలనే అమలు చేయమని అడుగుతున్నారు. అయితే ఈరోజు ఆయన కేసీఆర్, తెరాసల గురించి ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారో, తెదేపా గురించి జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధమయిన ఆరోపణలు చేస్తున్న సంగతి మరిచిపోకూడదు. ఈరోజు ఆయన కేసీఆర్ ని నిలదీస్తున్నట్లే రేపు చంద్రబాబుని కూడా రుణమాఫీలపై వెనుకంజ వేస్తే నిలదీసేందుకు కాంగ్రెస్, వైకాపాలు చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నాయనే సంగతిని కూడా ఆయన గుర్తుంచుకోవడం మంచిది. వ్యవసాయ రుణాలు, ఎన్నికల హామీల విషయంలో తెరాసకో రూలు, తెదేపాకో రూలు ఉండబోదు గనుక రేపు చంద్రబాబుకి ఇటువంటి పరిస్థితే ఏర్పడవచ్చును.

 

అందువల్ల ఈ రుణాలమాఫీల వ్యవహారం అన్ని రాజకీయ పార్టీలు ఒక గుణపాటంగా స్వీకరించడం మంచిది. అధికారం చేజిక్కించుకోవడం కోసం వేలకోట్ల రుణాలు మాఫీ చేస్తామని హామీలు ఇచ్చి, తీరాచేసి అధికారం దక్కించుకొన్న తరువాత ఇలా ఆపసోపాలు పడటమెందుకు? ప్రతిపక్షాల చేత, ప్రజల చేత తిట్లు తినడం ఎందుకు? అసలు మనకు అన్నం పెట్టేందుకు రైతులు అప్పులు చేసి వ్యవసాయం చేయవలసిన దుస్థితి కలుగుతున్నందుకు రాజకీయ నేతలు సిగ్గుపడాలి. వారికి ఈ కష్టం నుండి బయటపడేసి మళ్ళీ ఈవిధంగా అప్పులు చేయవలసిన పరిస్థితి రాకుండా చేసేందుకు ప్రయత్నించాలి. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కావలసింది రాజకీయ నేతల సానుభూతి కాదు. ఇటువంటి పరిస్థితులు దాపురించకుండా వారికి ప్రభుత్వాలు సహాయ సహకారాలు ఇస్తే చాలు.

google-ad-img
    Related Sigment News
    • Loading...