14 ఏళ్లు పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ నిందితుడు అరెస్టు

posted on: May 28, 2026 6:17PM

 

హైదరాబాద్ నగరంలో 14 సంవత్సరాలుగా పోలీసుల కన్నుగప్పి తిరుగుతున్న సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ విష్ణవ్ కిషన్ దాస్ అలియాస్ వి. గణేష్ మహరాజ్‌ను సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం ఏర్పాటుచేసి, సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి నిఘాతో నిందితుడిని మలక్‌పే టలో అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన విష్ణవ్ కిషన్ దాస్‌పై 1999 నుంచే సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ కొనసాగుతోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు ఇతర జిల్లాల్లో కలిపి అతనిపై మొత్తం 21 కేసులు నమోదయ్యాయి. వీటిలో హత్య, హత్యాయత్నం, దోపిడీలు, చోరీలు, ఆయుధాల చట్టం కింద నమోదైన కేసులు ఉన్నాయి.

ప్రత్యేకంగా 2010లో నమోదైన సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అతను రెండో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో 2010లో నాంపల్లి కోర్టులో లొంగిపోయిన నిందితుడు, 2012లో బెయిల్‌పై విడుదలై అనంతరం కోర్టు విచారణలకు హాజరుకాకుండా పరారీలోకి వెళ్లాడు. అప్పటి నుంచి అతడిని పోలీసులు వెతుకుతున్నారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు తన అసలు గుర్తింపును దాచేందుకు ఆధార్‌తో పాటు ఇతర పత్రాల్లో పేరును ‘వైష్ణవ్ కిషన్ దాస్’ నుంచి ‘వైష్ణవ్ గణేష్ మహరాజ్’గా మార్చుకున్నట్లు గుర్తించారు. 

ప్రస్తుతం మలక్‌పేటలో ఉంటున్నాడన్న విశ్వసనీయమైన సమాచారం రావడంతో వెంటనే పోలీసులు దాడి చేసి అతని అరెస్ట్ చేశారు. నకిలీ గుర్తింపు పత్రాల అంశంపై కూడా పోలీసులు విడిగా దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిపై 1999 నుంచి 2010 మధ్య కాలంలో  3 కేసులు సుల్తాన్ బజార్, మల్కాజిగిరి, మార్కెట్, 2 కేసులు చాదర్ఘాట్, కుషాయిగూడ, షాహినాయత్ గంజ్, 3 కేసులు చిక్కడపల్లి, కొత్తూరు, పరిగి, గాంధీనగర్, కార్ఖానా, ఎల్బీనగర్, 4 కేసులు సరూర్నగర్ ఇలా వివిధ పోలీస్ స్టేషన్లలో హత్య, హత్యాయత్నం, చోరీ, దోపిడీ, ఆయుధాల చట్టం తదితర సెక్షన్ల కింద 21 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ఎట్టకేలకు సుల్తాన్ బజార్ పోలీసులు కృషిచేసి 14 ఏళ్లు పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్‌ని అరెస్టు చేయడంతో... సుల్తాన్‌బజార్ పోలీసు బృందాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అభినందించారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...