కరెంటు, ఫోన్ బిల్లుల్లాగే నెలనెలా ఏఐకీ చెల్లింపులు!
posted on: Mar 16, 2026 4:57PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ప్రపంచంలో ఒక సరికొత్త ఆర్థిక విప్లవం ఆవిష్కృతమౌతలోంది. ఇప్పటివరకు సాఫ్ట్‌వేర్ రూపంలో వాడుతున్న ఏఐ, భవిష్యత్తులో మనం ఇంట్లో వాడే విద్యుత్ లేదా నీటి సరఫరా వంటి ఒక నిత్యావసరసేవగా మారబోతోంది. ఇదే విషయాన్ని ఓపెన్ ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్మాన్ వాషింగ్టన్ డీసీలో జరిగిన 'బ్లాక్‌రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ వెల్లడించారు. నెలనెలా మనం విద్యుత్, ఫోన్ బిల్లులు కట్టినట్లుగా భవిష్యత్ లో మనం ఎంత మేరకు ఏఐ సేవలను వినియోగించుకుంటామో అంత మేర బిల్లు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. అంటే, మీ ఇంట్లోని కరెంటు మీటర్ ఎన్ని యూనిట్లు ఉపయోగించామో బిల్లు చూసి డబ్బులు చెల్లించినట్లుగానే ఏఐ సేవలను కూడా మీటర్ ప్రాతిపదికన కొనుగోలు చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటున్నారు శ్యామ్ ఆల్ట్మాన్.
ఏఐని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం. ఇంటెలిజెన్స్ అబండెన్స్ అనే కాన్సెప్ట్‌ను ఆల్ట్‌మాన్ బలంగా ప్రతిపాదిస్తున్నారు. అంటే ఏఐ ఒక లగ్జరీగా, సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండే సేవగా కాకుండా, సామాన్యులు కూడా తమకు కావాల్సిన చిన్న చిన్న పనుల కోసం వినియోగించుుకునేలా అందుబాటులోకి రావాలని, వస్తుందని చెబుతున్నారు. ఇదెంత సులభంగా అందుబాటులోకి రావాలంటే.. టాప్' తిప్పితే నీరు వచ్చేంత సులువుగా అందరికీ అందేలా ఏఐ ఉండాలన్నది శ్యామ్ అల్ట్మాన్ మాటల సారాంశం. ఏఐ అందుబాటులోకి వచ్చిందంటే ఇక భారీ సాఫ్ట్‌వేర్ ప్యాకేజీలు కొనాల్సిన అవసరం ఉండదంటారాయన.
ఈ యూటిలిటీ మోడల్ వల్ల చిన్న వ్యాపారవేత్తలకు లాభం చేకూరుతుంది. ఏఐని తక్కువగా వాడే వారు తక్కువ చెల్లిస్తారు. అయితే, నిరంతరం ఏఐపై ఆధారపడే పవర్ యూజర్స్ కు ఈ మీటర్ విధానం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం మెండుగా ఉందంటున్నారు టెక్నాలజీ ఎనలిస్టులు. జాన్ నోస్టా వంటి నిపుణులు దీనిని కేవలం వ్యాపార మోడల్‌గా కాకుండా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ను ఒక ఎక్స్టర్నల్ సర్వీస్ గా మారుతున్న క్రమంగా అభివర్ణిస్తున్నారు.
ఏఐని ఒక నిత్యావసరంగా, ఇక యూనివర్సల్ యుటిలిటీగా మార్చడం తేలికైన పనేంకాదు. అలాగని అసాధ్యం కూడా కాదు. ఇందు కోసం భారీ డేటా సెంటర్లు, వేల గిగావాట్ల విద్యుత్ అవసరమౌతుంది. అందుకే ఓపెన్ ఏఐ సంస్థ అమెజాన్, ఎన్విడియా వంటి దిగ్గజాలతో కలిసి భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై పెట్టుబడులు పెడుతోంది. మరో రెండేళ్ల కళ్లా డేటా సెంటర్ల సామర్థ్యం మానవ జనాభా మొత్తం ఆలోచించే శక్తిని మించిపోయే అవకాశాలున్నాయని శ్యామ్ ఆల్ట్‌మాన్ చెబుతున్నారు.
ఈ మార్పు వల్ల పని సంస్కృతి అనివార్యంగా మారుతుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు గంటల తరబడి చేసే కోడింగ్‌ను ఏఐ నిమిషాల్లో పూర్తి చేస్తోంది. దీంతో పనులు చేసే ఉద్యోగుల కంటే ఏఐ పనిని పర్యవేక్షించే గైడ్ ల అవసరమే ఎక్కువగా ఉంటుంది. ఏఐ ఎంత చౌకగా అందుబాటులోకి వస్తే అంతవేగంగానూ నూతన ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తాయని శ్యామ్ ఆల్ట్మాన్ అన్నారు.






