Latest News
మహిళలకు నెలసరి సెలవులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
posted on: Mar 14, 2026 3:14PM

మహిళలకు నెలసరి సెలవులను చట్టబద్ధంగా తప్పనిసరి చేస్తే ఉద్యోగ నియామకాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలాంటి విధానం అమలులోకి వస్తే మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవడంలో యజమానులు వెనుకంజ వేసే అవకాశముందని ధర్మాసనం పేర్కొంది.
ఉద్యోగినులు, విద్యార్థినులకు నెలసరి సెలవులు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నెలసరి సెలవులను చట్టబద్ధంగా తప్పనిసరి చేస్తే యువతులు తాము ఇతర ఉద్యోగులతో సమానం కాదనే భావనకు లోనయ్యే అవకాశం ఉందని, ఇది వారి పురోగతికి ఆటంకంగా మారవచ్చని అభిప్రాయపడింది.
నెలసరి సెలవుల అంశంపై భారతీయ సమాజంలో చాలాకాలంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఈ సెలవులు మహిళలకు ఉపశమనంగా ఉంటాయని భావిస్తుండగా, మరికొందరు ఇది లింగ వివక్షను మరింత పెంచే ప్రమాదం ఉందని అంటున్నారు. అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని రాష్ట్రాలు, అలాగే అనేక ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగినులకు నెలసరి సెలవులను అమలు చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో నెలసరి సెలవు విధానాన్ని అమలు చేయాలని కోరుతూ న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణ సందర్భంగా పీరియడ్స్ సమయంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రెండు నుంచి మూడు రోజుల సెలవులు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు.
అయితే న్యాయమూర్తులు మాత్రం అలాంటి విధానం మహిళలకు ప్రయోజనం కలిగించదని స్పష్టం చేశారు. ఇది లింగ సంబంధిత మూసధోరణులను మరింత బలపరచడంతో పాటు మహిళల ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రైవేటు కంపెనీలు మహిళలను నియమించుకోవడంలో వెనుకంజ వేసే పరిస్థితి కూడా ఏర్పడవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది.
కేరళ రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో ఆడపిల్లలకు నెలసరి సమయంలో లీవ్ రిలాక్సేషన్ అందిస్తున్నారు. అలాగే కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా మహిళలకు స్వచ్ఛందంగా నెలసరి సెలవులు ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా మహిళలకు నెలసరి సెలవులు తప్పనిసరి చేయాలని కోరుతూ న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాజాగా విచారణ జరిపింది.






