వర్ష బీభత్సం.. ఈదురు గాలుల విలయం

మొంథా పెను తుపాను మంగళవారం అర్ధరాత్రి తీరం దాటింది.కాకినాడ, మచిలీపట్నం మధ్య అంతర్వేది పాలెం సమీపంలో తీరం దాటింది. తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి.  అత్యధిక ప్రభావం ఉన్న కాకినాడ, కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని చింతూరు, రంపాచోడవరం డివిజన్లలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి 8:30 గంటల నుంచి బుధవారం ఉదయం 6:00 గంటల వరకు ఈ ఏడు జిల్లాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.  వరి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది.  

మొంథా తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నిరంతరాయ కమ్యూనికేషన్ కోసం 81 వైర్‌లెస్ టవర్లు, 21 పెద్ద దీపాలను సిద్ధం చేశారు. కూలిపోయిన చెట్లను తొలగించడానికి 1,447 ఎర్త్‌మూవర్లు, 321 డ్రోన్‌లు, 1,040 చైన్‌సాలు సిద్ధంగా ఉంచారు. ముందస్తు జాగ్రత్తగా, రాష్ట్రవ్యాప్తంగా నివాసితులకు 3.6 కోట్ల అలెర్ట్ సందేశాలను పంపించారు.ఇక తుపాను ప్రభావంతో   పలు జిల్లాలు అతలాకుతలం అయ్యీయి. కుండపోత వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు ఘాట్ రోడ్డుపై వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. 

ప్రకాశం జిల్లాలోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒంగోలు సమీపంలోని యరజర్ల-వెంగముక్కలపాలెం మధ్య ఉన్న వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఓ కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. అకస్మాత్తుగా పెరిగిన వరద తీవ్రతకు కారు అదుపుతప్పి వాగులోకి జారిపోయింది. అయితే, డ్రైవర్ అప్రమత్తమై వెంటనే కారులో నుంచి బయటకు రావడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రస్తుతం భూభాగంపై ప్రవేశించిన ఈ తుపాను క్రమంగా బలహీనపడుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  తుపాను ప్రభావంతో బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం.. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నాయి. అలాగే కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu