Latest News
డ్రగ్స్ కేసులో నలుగురు పరార్....కీలక నిందితుడు అభిషేక్ ఆచూకీ గల్లంతు
posted on: Mar 24, 2026 4:06PM

హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు దర్యాప్తు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో తాజాగా నలుగురు నిందితులు పరారై నట్లు పోలీసు వర్గాలు సమాచారం వెల్లడించడంతో దర్యాప్తు మరింత ఉత్కంఠ భరితంగా మారింది. మరోవైపు ఈ కేసులో కీలకంగా భావిస్తున్న డ్రగ్స్ పెడ్లర్ అభిషేక్ సింగ్ ఆచూకీ కూడా గల్లంతవడం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచే నలుగురు నిందితులు కనిపించకుండా పోయినట్లు సమాచారం. వీరి కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే గుర్తించిన చిరునామాలు, ఫోన్ కాల్ డేటా, సాంకేతిక ఆధారాల ఆధారంగా బృందాలు వారి కదలికలను ట్రాక్ చేస్తున్నాయి. దర్యాప్తు బృందాల సమాచారం ప్రకారం... ఈ కేసులో ఒక నిందితుడు గతంలో గోవాలో జరిగిన డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్లు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. అక్కడ మత్తు పదార్థాల వినియోగం జరిగినట్లు ప్రాథమిక సమాచారం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ నెట్‌వర్క్‌కు రాజకీయ, వ్యాపార వర్గాలతో సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. ఫ్యూచర్‌సిటీ కమిషనర్ సుధీర్ బాబు నేతృత్వం లోని ప్రత్యేక దర్యాప్తు బృందం గతంలో జరిగిన డ్రగ్స్ పార్టీలపై కూడా లోతు గా విచారణ జరుపుతోంది.
అదే విచారణ ఒత్తిడితోనే కొందరు నిందితులు పరారైనట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులుగా గుర్తించారు. ఇప్పటికే పలువురిని విచారించినట్లు సమాచారం. విచారణలో రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిత్ శర్మతో పాటు మరికొందరి పేర్లు వెలుగు లోకి వచ్చాయి. ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేరు కూడా ఈ కేసులో చర్చనీయాంశంగా మారింది. వీరిలో ఎంపీ పుట్టా మహేష్ మినహా మిగిలిన నిందితులను గత వారం రోజులుగా అధికా రులు విడతల వారీగా విచారించినట్లు సమాచారం.
అంతే కాకుండా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న ముగ్గురుని నీతులను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు కోర్టు అనుమతించింది కోర్టు ఇచ్చిన అనుమతితో ఈ ముగ్గురు నిందితులను మూడు రోజులపాటు ప్రత్యేక బృందం విచారణ చేయనున్నది. ఇక ఈ కేసులో అత్యంత కీలకంగా భావిస్తున్న డ్రగ్స్ పెడ్లర్ అభిషేక్ సింగ్ (24) ప్రస్తుతం అదృశ్యంగా ఉన్నాడు. ఈ నెల 16వ తేదీ నుంచి అతడి ఆచూకీ లభించకపోవడంతో అతడి తండ్రి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఫిర్యాదు ప్రకారం, అభిషేక్ సింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో పని చేస్తూ గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నాడు.
సాధారణంగా బయటకు వెళ్లినా తిరిగి ఇంటికి వచ్చే అలవాటు ఉన్న అతడు ఈసారి తిరిగి రాకపోవడం తో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అదే రోజు విచారణలో ఉన్న రోహిత్ రెడ్డి డ్రైవర్ మరియు వ్యక్తిగత సహాయకుడు సిలివేరు శరత్ ఇచ్చిన వాంగ్మూలం కేసుకు కొత్త కోణం ఇచ్చినట్లు తెలు స్తోంది. శరత్ చెప్పిన వివరాల ప్రకారం.. రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు ఓఆర్ఆర్ పరిసరాల్లో అభిషేక్ సింగ్‌ను కలిసినట్లు, అక్కడే డ్రగ్స్ వినియోగం జరిగినట్లు చెప్పినట్లు సమాచారం.
ఈ వాంగ్మూలం ఆధారంగా అభిషేక్ సింగ్ పాత్రపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తు న్నారు. అభిషేక్ సింగ్‌కు రోహిత్ రెడ్డితో స్పష్టమైన సంబంధాలు ఉన్నాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. అయితే ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు, స్వచ్ఛం దంగా దూరమయ్యాడా లేదా ఇతర కారణాలు న్నాయా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. మొత్తానికి డ్రగ్స్ కేసులో పోవే కొద్దీ కొత్త వ్యక్తుల పేర్లు, కొత్త ఆధారాలు బయట పడుతున్నాయి. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు పేర్కొంటున్నాయి.


.webp)



