మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు.. విచారణకు సహకరించని నిందితులు

posted on: Mar 21, 2026 9:35AM

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్ కేసు రోజురోజుకూ సంక్షిష్టంగా మారుతోంది. సిట్ విచారణలో నిందితులు చెబుతున్న పొంతన లేని సమాధానాలు దర్యాప్తు అధికారులను అయోమయానికి గురి చేస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన మద్యం, డ్రగ్స్ పార్టీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం దర్యాప్తునకు సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

నిందితులను శంషాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ లో సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణలో నిందితులు పొంతన లేని సమధానాలు ఇచ్చినట్లు తెలిసింది.  నిందితులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమాధానాలు చెప్పడం దర్యాప్తు అధికారులను   విస్మయానికి గురిచేస్తోంది. పార్టీలో వాడిన కొకైన్‌ను తానే స్వయంగా ఓఆర్‌ఆర్  సమీపంలో అభిషేక్ సింగ్ అనే వ్యక్తి నుంచి తీసుకువచ్చినట్లు రోహిత్ రెడ్డి కారు డ్రైవర్ అంగీకరించాడు. అయితే..  ఇదే విషయంపై మరో నిందితుడు కౌశిక్ రవి మాత్రం తాను ఆ డ్రగ్స్‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాలో కొనుగోలు చేసినట్లు  చెప్పాడు.

విచారణ ప్రారంభంలో మౌనంగా ఉన్న కౌశిక్ రవి, ఆ తర్వాత అధికారుల ప్రశ్నలకు గందరగోలంగా, పొంతన లేని సమాధానాలిస్తూ  దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అదలా ఉంటే   డ్రగ్స్ సరఫరా చేసినట్లు భావిస్తున్న ప్రధాన నిందితుడు అభిషేక్ సింగ్  ఇప్పటికీ పరారీలోనే ఉండటంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే అభిషేక్ సింగ్ తండ్రిని అదుపులోనికి తీసుకుని విచారించారు. ఆ విచారణలో అభిషేక్ సింగ్ ఆచూకీగానీ, కీలక వివరాలు కానీ ఏమీ వెల్లడి కాలేదని సిట్ వర్గాల సమాచారం. 

ఇక పోతే   ఏడుగురు నిందితులకు ఒకే బ్యాంకులో  దాదాపు 20 ఖాతాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఖాతాల ద్వారా జరిగిన నగదు బదిలీలు ఎంు కోసం అన్న కోణంలో దర్యాప్తు సాగుతున్నది.  అభిషేక్ సింగ్ పట్టుబడితే ఈ ఆర్థిక మూలాల వెనుక ఉన్న అసలు రహస్యాలు బయటపడతాయని  అంటున్నారు.  ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న కీలక నిందితులు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి,  నమిత్ శర్మల కస్టడీ పిటిషన్ పై తీర్పును కోర్టు సోమవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.. కోర్టు వీరిని కస్టడీకి అనుమతిస్తే మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో అసలు సూత్రధారులు, పాత్రధారుల వివరాలు వెల్లడవుతాయని సిట్ అధికారులు భావిస్తున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...