మొయినాబాద్ జంట హత్య కేసులో...నిందితులను పట్టించిన సెల్ ఫోన్

posted on: May 19, 2026 8:21PM

 

మొయినాబాద్ పరిధిలో సంచలనం సృష్టించిన ఫామ్ హౌస్ కేసులో రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేక అప్పు ఇచ్చిన వారినే హత్య చేయాలని కరిమాబి– రెహమాన్ దంపతులు ముందుగానే పక్కా ప్రణా ళిక వేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

మొత్తం ఎనిమిది మంది మహిళలు ఈ దంపతులకు డబ్బులు అప్పుగా ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వారిలో ఇద్దరిని “డబ్బులు ఇస్తాం” అని నమ్మబలికి మొయినాబాద్ ఫామ్ హౌస్ వద్దకు పిలిపించి అతి దారుణంగా హత్య చేసినట్లు విచారణలో బయటపడింది. ఇద్దరు మహిళల మిస్సింగ్ కేసులపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో ఒక సెల్‌ఫోన్ కీలక ఆధారంగా మారింది. 

మొదటి బాధితురాలిని హత్య చేసిన అనంతరం ఆమె ఫోన్‌ను కరిమా తీసుకెళ్లి చాలా రోజుల పాటు ఉపయో గించకుండా ఉంచింది. తరువాత సిమ్ కార్డ్ వేసి వాడటం ప్రారంభించడంతో, అప్పటికే నమోదైన మహిళ మిస్సింగ్ కేసు ఆధారంగా పోలీసులు IMEI ద్వారా ట్రేస్ చేసి కరిమా వరకు చేరుకోవడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది.
పోలీసుల దర్యాప్తులో కరిమా–రెహమాన్ పలువురి దగ్గర అప్పులు చేసినట్లు తెలిసింది. 

సంవత్సరం పాటు డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు ఒత్తిడి చేయడంతో వారిని ఒక్కొక్కరిగా అంతం చేయాలని నిర్ణయించారు. మొదటి హత్యను మార్చి 27న ఇద్దరూ కలిసి చేయగా, రెండో హత్యను మే 4న కరిమా ఒంటరిగా చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల నుంచి సుమారు రూ.14–15 లక్షల రూపాయలు తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కొంత డబ్బును వ్యక్తిగత ఖర్చులకు వినియోగించగా, మిగిలిన డబ్బుతో తన కుమారుడిని గల్ఫ్ దేశాలకు పంపాలని కరిమా భావించినట్లు విచారణలో వెల్లడైంది. 

కరీమా దంపతులు ముందుగానే బాధితులను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది... ఈ నేపథ్యంలోనే సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను ఎంచుకోవడం, మొబైల్ ఫోన్లు ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చివరకు అదే సెల్‌ఫోన్ నిందితులను పోలీసులకు పట్టించింది. ఇప్పటికే ఈ కేసులో మిగతా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...