Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పార్లమెంట్ ఆవరణలో మోడీ, రాహుల్ ముచ్చట్లు
posted on: Apr 11, 2026 10:55AM

పార్లమెంటు లోపలా బయటా కూడా నిప్పు, ఉప్పులా విమర్శలు కురిపించుకునే ప్రధాని మోడీ, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నవ్వులూ ముచ్చటించుకుంటున్నముచ్చటైన దృశ్యం శనివారం (ఏప్రిల్ 11) ఆవిష్కృతమైంది. సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో జరిగిన ఈ నివాళుల కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు పాల్గొన్నారు.
సామాజిక సమానత్వం కోసం ఫూలే చేసిన కృషిని ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి దేశం గర్వించదగ్గ మహనీయుడికి నివాళులర్పించే క్రమంలో ప్రధాని, రాహుల్ గాంధీ ఒకే చోట కనిపించడం, ఇరువురూ కొద్ది సేపు ముచ్చటించుకోవడం భారత ప్రజాస్వామ్య ఔన్నత్యానికి ప్రతీకగా నిలుస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. ఫూలే ఒక దార్శనిక నేత అని పేర్కొన్న ఆయన సామాజిక న్యాయం కోసం ఆయన పడ్డ తపన భావితరాలకు మార్గదర్శకమని ప్రస్తుతించారు.
ముఖ్యంగా మహిళా సాధికారత, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన వేసిన పునాదులు నేటికీ ఆదర్శప్రాయమన్న ప్రధాని, విద్యే శక్తివంతమైన ఆయుధమని నమ్మిన ఫూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఫూలే ద్విశత జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఫూలే ఆశయాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. అటు ప్రతిపక్షాలు కూడా సామాజిక న్యాయం ప్రాతిపదికన వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. దేశం గర్వించే సంస్కర్త గౌరవార్థం అధికార, ప్రతిపక్ష నేతలు ఏకతాటిపైకి రావడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిచెప్పిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



.webp)


