మోడీ కుదరదని ముందే చెబుతున్నారా..!

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపు రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నసంగతి తెలిసిందే కదా. కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. ఇక ఏలాగూ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు కాబట్టి బిల్లు ఆమోదం జరిగిపోయింది. ప్రతిపక్షం ఉన్నా బిల్లుకు ఓకే చెప్పకతప్పదు. ఎందుకంటే.. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఎప్పటినుండో జగన్ కూడా పట్టుబడుతున్నాడు కాబట్టి. చంద్రబాబు బిల్లును ప్రవేశపెట్టడం... ఆమోదం పొందడం.. అన్నీ జరిగిపోయాయి. దీంతో చంద్రబాబు చేతులు దులిపేసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకోవాల్సిందల్లా కేంద్ర ప్రభుత్వమే.

 

కానీ ఇప్పుడు మోడీ చెబుతున్న మాటలు వింటుంటే.. అది జరగడం కాస్త కష్టమే అనిపిస్తోంది. త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే కదా. ఈ ఎన్నికల్లో భాగంగా మోడీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ.. గత కొద్ది రోజులుగా  జరుగుతున్న గుజరాత్ రిజర్వేషన్లపై వ్యాఖ్యానించారు. పటీదార్ అనామత్ ఆందోళన్ సంస్థ తమకు రిజర్వేషన్లు కావాలంటూ గతంలో పెద్దఎత్తున పోరాటం చేశారు అయితే అప్పట్లో రిజర్వేషన్ల అంశాన్ని పరిశీలిస్తామన్న బీజేపీ దానిని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ వారికి రిజర్వేషన్ల హామీని ఇచ్చింది. దీంతో ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. దీంతో 'యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తామని ఎవరైనా చెబితే అది తప్పుడు హామీయే అవుతుంద'ని అన్నారు. అంటే విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం పరిమితిని దాటడం వీలుపడదని స్పష్టం చేశారు.

 

దీంతో ఇప్పుడు కాపు రిజర్వేషన్లపై అనుమానం కలుగుతోంది. చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంతో అది కాస్తా 55 కు చేరింది. ఇప్పటికే బీసీలో ఉన్న A,B,C,D గ్రూపులకు 25 శాతం రిజర్వేషన్లు, బీసీ E కేటగిరీలో ఉన్న మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు, ఎస్సీలకు 15, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అంటే అన్నీ కలిపి 55 శాతం అవుతున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. ఇదే విషయం మోడీ చెప్పింది. ఒక్క ఏపీనే కాదు.. తెలంగాణలో కేసీఆర్ కూడా..  ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ప్రకటించింది. దీంతో రెండు రాష్ట్రాలు 55 శాతాన్ని దాటాయి. ఇక ఇప్పుడు మోడీ చేసిన ఈ వ్యాఖ్యలవల్ల... ఇద్దరు చంద్రులు పరిస్థితి అయోమయంలో పడింది. మరి మోడీ చెబుతున్న మాటలు వింటుంటే... ఈ రిజర్వేషన్లకు పార్లమెంట్లో ఆమోదం లభించడం కష్టమే అనిపిస్తోంది. దీంతో మోడీ ఇద్దరికీ ఓ క్లూ ఇచ్చినట్టైంది. మరి ఈ బిల్లులు ఎంత వరకూ కార్యరూపం దాల్చుతాయో.. చూద్దాం...