మోడీ గారు జాగ్రత్త... ఏపీ స్టామినా చూడొద్దు...
posted on: Dec 2, 2017 12:34PM

ఒకటిగా ఉన్న రాష్ట్రాన్ని రెండుగా చీల్చి.. నడిరోడ్డు మీద అనాథను వదిలేసినట్టు యూపీఏ ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేసిన సంగతి తెలిసిందే. అందుకు గాను కాంగ్రెస్ కు ఎలా బుద్ది చెప్పాలో అలా బుద్ది చెప్పారు. ఇంకా కొన్ని సంవత్సరాలైనా కాంగ్రెస్ చేసిన పాపం అంత త్వరగా మరిచిపోలేరు. ఇప్పుడు కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పట్టనుందా.. మోడీకి కూడా బుద్ది చెప్పే సమయం దగ్గర పడిందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఇప్పటికే.. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే మొండిచేయి చూపించింది. పది సంవత్సరాలు ఇస్తానని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చి దాన్ని ఇప్పుడు తుంగలో తొక్కేశారు. ఇదిలా ఉంటే ఏపీకి రావాల్సిన నిధుల విషయంతో పాటు రాజధాని నిర్మాణానికి చేసే సాయం విషయంలో మాట తప్పడం, విశాఖ రైల్వేజోన్‌ను ఇవ్వకపోవడం ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాల్లో కేంద్రం ఏపీని చిన్న చూపు చూస్తుంది. ఇప్పుడు ఏకంగా ఆంధ్రుల కలల ప్రాజెక్టు, జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు పుల్ల వేసింది. పోలవరం పూర్తయ్యేందుకు బాబు ఎన్నో కష్టాలు పడుతుంటే మరోవైపు ఈ ప్రాజెక్టుకు మోడీ సర్కార్ అడుగడుగునా అడ్డుతగులుతున్నారు.
ఇక ఇప్పటి వరకూ సహనంగా ఉన్నా చంద్రబాబుకు కూడా.. కేంద్ర ప్రభుత్వంపై ఉన్న సహనం నశించింది. దీంతో ఆయన బీజేపీకి నమస్కారం పెట్టి తప్పుకుంటామని చెప్పారు. దీంతో కేంద్ర ప్రభుత్వం, మోడీ చేసిన మోసాన్ని ఏపీ ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఏపీ ప్రజల ఆత్మాభిమానాలతో ఆడుకుంటోందని అనుకుంటున్నారు. మరి తెలుగు ప్రజలు ఎన్ని ఇబ్బందులు, బాధలు, కష్టాలు అయినా భరిస్తారు కాని… ఆత్మగౌరవం మీద దెబ్బకొడితే సహించరు. మరి మోడీగారు ఇప్పటికైనా కళ్లు తెరిస్తే మంచిది. లేకపోతే... కాంగ్రెస్ కు ప్రజలు ఎలా అయితే బుద్ది చెప్పారో.. బీజేపీకి కూడా బుద్ది చెప్పే పరిస్థితి వస్తుంది.




.jpg)

.webp)



