ఎమ్మెల్సీ ఎన్నికలు అన్ని పార్టీలకూ అగ్నిపరీక్షే

 

వచ్చే నెల 1వ తేదీన తెలంగాణాలో ఆరు యం.యల్సి. స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. ఒక్కో యం.యల్సి. అభ్యర్ధి గెలిచేందుకు కనీసం 18మంది యం.యల్యే.ల మద్దతు అవసరం ఉంటుంది. ప్రస్తుతం తెరాసకు (కాంగ్రెస్, తెదేపా, వైకాపాల నుండి వచ్చిన యం.యల్యే.లతో కలుపుకొని) మొత్తం 75మంది సభ్యులు ఉన్నారు. అంటే 72మంది సభ్యుల మద్దతుతో నలుగురు యం.యల్సీ.లను అవలీలగా గెలిపించుకొన్న తరువాత కూడా ఇంకా ఆ పార్టీకి మరో ముగ్గురు యం.యల్యేలు మిగిలే ఉంటారన్న మాట. అందుకే, తనకు మిత్రపక్షాలుగా ఉన్న మజ్లీస్ (7మంది) వామ పక్షాలు (ఇద్దరు), వైకాపా (ఒక్కరు) మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. అయితే తెరాస నిలబెట్టాలని చూస్తున్న 5వ అభ్యర్ధికి తమ మద్దతు కోరే బదులు తమ పార్టీ అభ్యర్ధికే తెరాస మద్దతు ఇవ్వాలని మజ్లిస్ పార్టీ కోరినట్లు సమాచారం. కనుక ఒకవేళ తెరాస కనుక తన 5వ అభ్యర్ధికి మద్దతు కూడగట్టుకోలేకపోయినట్లయితే, మజ్లీస్ అభ్యర్ధికే మద్దతు ఇచ్చినా ఇవ్వవచ్చును.

 

తెరాసలో కొత్తగా మంత్రులుగా చేరిన కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర రావులకు శాసనసభలో కానీ శాసనమండలిలో గానీ సభ్యత్వం లేకపోవడంతో వారిరువురికీ చెరో యం.యల్సీ. సీటును ఖాయం చేసారు. మిగిలిన రెండు సీట్లకు అమోస్, బి. వెంకటేశ్వరులు, యన్. లక్ష్మణ్ రావు, యాదవ్ రెడ్డి, విద్యాసాగర్ రావు తదితర్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఇక కాంగ్రెస్ పార్టీకి మొత్తం 17 మంది యం.యల్యేలున్నారు. కనుక ఇతర పార్టీల నుండి కనీసం మరొక్క యం.యల్యే. మద్దతు చాలా అవసరం. సీటు ఆశిస్తున్న వారు అందరూ బయట నుండి ఒక్క యం.యల్యే మద్దతు తప్పకుండా కూడగట్టుకోగలమనే గట్టి నమ్మకంతో ఉన్నారు. కనుక ఆ ఒక్క సీటుకోసం టీ-కాంగ్రెస్ లో చాలా తీవ్రమయిన పోటీ నెలకొని ఉంది.

 

తెదేపా (11), బీజేపీ (5) కూటమికి మొత్తం 16 మంది యం.యల్యేలున్నారు. కనుక వారి అభ్యర్ధిని గెలిపించుకొనేందుకు వారికి కూడా బయట నుండి మరొక ఇద్దరు యం.యల్యేల మద్దతు అవసరం ఉంటుంది. వారు కూడా వామపక్షాల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమయినప్పటికీ నామినేషన్లు వేయడానికి ఈ నెల 21వ ఆఖరు రోజు. కనుక ఆలోగానే అన్ని పార్టీలు ఈ కూడికలు, తీసివేతలు పూర్తి చేసుకోక తప్పదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu