టీడీపీ గడపలోకి... మరో కడప నేత?
posted on Feb 9, 2017 3:49PM

అధికార పక్షంలోకి వలసలు కొనసాగుతూనే వున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అంతకంతకూ బలపడుతోంది. అయితే, తాజాగా టీడీపీ కండువా కప్పుకుంటారని వినిపిస్తోన్న పేరు వైసీపీ నేతది కాదు. ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు అధికార పక్షం వైపు కదులుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన ఇప్పటి వరకూ కడప జిల్లా, రైల్వే కోడూరు నియోజక వర్గాలకే పరిమితం అవుతూ వచ్చారు. కాని, ఆయన సేవల్ని మున్ముందు రాష్ట్ర స్థాయిలో తాము వినియోగించుకుంటామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బత్యాల చెంగల్ రాయుడు ఏర్పాటు చేసిన ఒక మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు!
బత్యాల చెంగల్ రాయుడుకు మద్దతు తెలుపుతోన్న రైల్వే కోడూరు నియోజకవర్గ నాయకులు, మండలాధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు పాల్గొన్న సమావేశంలో మాట్లాడిన గంటా స్పష్టంగా సంకేతాలు ఇచ్చారు. బత్యాల టీడీపీలో చేరటం ఇక లాంఛనమే అంటున్నారు జిల్లా నేతలు. ఆయన చేరిక వల్ల టీడీపీకి కడప జిల్లాలో రాజకీయంగా మంచి లాభమే చేకూరనుంది. అలాగే, నీటి పారుదల అంశంలో బత్యాల చెంగల్ రాయలుకు వున్న అనుభవం, పరిజ్ఞానం కూడా ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మంత్రి గంటా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అన్ని పాంతాలకు నీరెలా అందించాలన్న విషయంపై గతంలో బత్యాల రూపొందించిన నివేదికలు చంద్రబాబును కూడా మెప్పించగలిగాయి. కాబట్టి ఆయన చేరిక పార్టీకి, ప్రభుత్వానికి కూడా మేలు చేస్తుందని భావిస్తన్నారు.
తాను టీడీపీలో చేరుతున్నట్టు బత్యాల చెంగల్ రాయుడు ఇప్పటికైతే అధికారికంగా చెప్పలేదు కాని ఆయన చేరిక త్వరలోనే జరుగుతుందని భావించవచ్చు. తనకు మద్దతునిస్తున్న 35మంది జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో చర్చలు జరిపి ఎవరికి మద్దతు పలకాలో తేల్చుకుంటానని ఆయన అన్నారు. అయితే, మంత్రి స్వయంగా వెళ్లి ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనటంతో బత్యాల టీడీపీ ఆగమనం లాంఛనమే అనిపిస్తోంది.