Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సైబర్ వలలో ఎమ్మెల్యే పల్లా
posted on: Apr 9, 2026 2:59PM

సైబర్ నేరగాళ్ల వలలో సామాన్యులే కాదు.. ప్రజాప్రతినిధులు కూడా చిక్కుకుంటున్నారు. తాజాగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ మాయగాడి వలలో పడి లక్ష రూపాయలు పోగొట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి ఎమ్మెల్యేను దారుణంగా బోల్తా కొట్టించి మోసం చేశాడు. వివరాలిలా ఉన్నాయి. గత ఆదివారం ఉదయం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తాను తెలంగాణ ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న అనంతరామిరెడ్డిని అంటూ పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి.. కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వికసిత్ భారత్'పథకం కింద నియోజకవర్గంలోని అర్హులైన వారికి రూ. 10 లక్షల వరకు రుణాలు ఇప్పిస్తానని నమ్మించాడు.
నియోజకవర్గంలోని ఒక 40 మంది లబ్ధిదారుల జాబితా పంపిస్తే, వారికి వెంటనే లోన్లు మంజూరు చేయిస్తామంటూ నమ్మబలికాడు. దరఖాస్తు చేసుకోవడానికి అదే చివరి రోజని, ఒక్కొక్కరికి రూ. 2,500 చొప్పున మొత్తం 40 మందికి కలిపి రూ. 1 లక్ష ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని చెప్పాడు. ఎమ్మెల్యే పల్లా ఆ వ్యక్తి మాటలను పూర్తిగా నమ్మేసి.. తన నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆ మొత్తాన్ని ఫోన్ పే ద్వారా సదరు వ్యక్తికి పంపించారు.
డబ్బులు అందిన కొద్దిసేపటికే.. సాంకేతిక కారణాల వల్ల నగదు అందలేదని, మళ్ళీ పంపాలని ఆ వ్యక్తి మళ్ళీ ఒత్తిడి చేయడంతో ఎమ్మెల్యేకు అనుమానం వచ్చి, ఆర్థిక శాఖలో ఆరా తీశారు. దీంతో మోసం బయటపడింది. అసలు అలాంటి అధికారి ఎవరూ లేరని, అది ఒక పక్కా సైబర్ మోసమని తేలింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.
ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ పథకాల పేరిట వచ్చే ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఉదంతం మరో సారి గుర్తు చేసింది. ఏ ప్రభుత్వ పథకానికైనా నగదును వ్యక్తిగత ఖాతాలకు లేదా యూపీఐ ద్వారా పంపాలని కోరరని, అలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే అధికారులకు సమాచారం పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ విభాగం కూడా రంగంలోకి దిగింది.






