బీటెక్ విద్యార్థి మిస్సింగ్ కేసు...చివరకు విషాదాంతం

posted on: Jun 8, 2026 5:06PM

 

 కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బీటెక్ విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతమైంది. జగిత్యాల జిల్లాకు చెందిన అంకం రాహుల్ అనే విద్యార్థి మృతదేహం ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బావిలో లభ్యమైనట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ మృతదేహం రాహుల్‌దేనని తుది నిర్ధారణ కోసం డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించనున్నారు.

జగిత్యాల జిల్లాకు చెందిన అంకం రాజేశ్వర్ కుమారుడు రాహుల్ సైదాబాద్‌‌లోని  లక్ష్మికళ బాయ్స్ హాస్టల్‌లో ఉంటూ బీటెక్ చదువుతున్నాడు. అంకం రాహుల్ కనిపించడం లేదని అతని తండ్రి అంకం రాజేశ్వర్ కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా రాహుల్ చివరిసారిగా గత నెల మే 27న కాచిగూడ టూరిస్ట్ జంక్షన్ ప్రాంతంలో కనిపించినట్లు పోలీసులు గుర్తించారు. 

స్నేహితుడి మోటార్‌ సైకిల్‌పై అక్కడికి చేరుకున్న రాహుల్, అనంతరం తన స్నేహితులతో బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిపో యాడు. అయితే ఆతర్వాత అతను హాస్టల్‌ లేదా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. కేసును అత్యంత సీరియస్‌గా  తీసుకున్న కాచిగూడ పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ ఫోన్ లొకేషన్, సాంకేతిక ఆధారాలు, స్నేహితులు మరియు బంధువుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషిస్తూ విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. 

ఈ క్రమంలోనే నిన్న ఆదివారం పోలీసులకు ఓ సమాచారం అందింది... దీంతో ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మే 30న ఓ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. సింగరాయకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్న మృతదేహం వద్ద లభించిన వస్తువులు, దుస్తులు మరియు ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం అవి అదృశ్య మైన విద్యార్థి రాహుల్‌కు సంబంధించినవిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

దీంతో కాచిగూడ పోలీసులు, రాహుల్ కుటుంబ సభ్యులతో కలిసి గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. అయితే మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో కేవలం భౌతిక గుర్తుల ఆధారంగా నిర్ధారించడం సాధ్యం కాకపోవడంతో డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. డీఎన్‌ఏ నివేదిక వచ్చిన తర్వాతే మృతదేహం రాహుల్‌దేననే విషయంపై అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.ఈ పరిణామంతో రాహుల్ కుటుంబంలో విషాదం నెలకొంది. కాగా ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, డీఎన్‌ఏ పరీక్షల ఫలితాల అనంతరం తదుపరి చర్యలు చేపడతామని కాచిగూడ పోలీసులు వెల్లడించారు.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...