తెలంగాణ సర్కార్… కేంద్రంపైకి మిర్చీ ఘాటు మరల్చగలదా?

మిర్చీ ఘాటు మాంచి ఎండా కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది! ఏపీలో ఏకంగా ప్రతిపక్ష నేత దీక్షకే దిగారు. అయినా ప్రభుత్వం మిర్చీ రైతుల్ని శాంతిపజేసే చర్యలు తీసుకుంటున్నట్టు కనిపించటం లేదు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది కూడా ఏం లేదని చెప్పే వారు కూడా వున్నారు. ఇక మరి కొందరు రైతులు కోరిన విధంగా మద్దతు ధర ఇవ్వాలని హితవు పలుకుతున్నారు! ఏపీలో ఎలాంటి పరిస్థితి వుందో తెలంగాణలోనూ అలాంటి స్థితే నెలకొంది!

 

తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కి వ్యతిరేకంగా మిర్చీ బాగానే ఘాటు రేపింది. ఆయన సీఎం అయిన మూడేళ్లలో ఎప్పుడూ లేని విధంగా రైతులు రోడ్డెక్కారు. దాడులు చేసి కలకలం రేపారు. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, టీటీడీపికి మంచి అస్త్రాన్ని అందించారు! అందుకే, గత కొన్ని రోజులుగా మిర్చీ వ్యవహారాన్ని ఎదుర్కోవటంలో కేసీఆర్ ఒకింత ఇబ్బంది పడుతున్నారు. రైతులు అడిగిన విధంగా మద్దతు ధర ఇచ్చేయటం తేలికైనా పని కాదు. కానీ, ప్రతిపక్షాలు అదే డిమాండ్ ని క్యాష్ చేసుకుంటున్నాయి. రైతుల పక్షాన నిలిచామంటూ టీఆర్ఎస్ సర్కార్ ను కార్నర్ చేస్తున్నాయి!

 

మిర్చీ ఘాటు తట్టుకోలేకపోతున్న తెలంగాణ గవర్నమెంట్ కేంద్రాన్ని లాక్కొచ్చింది రచ్చలోకి. మద్దతు ధర నిర్ణయించటం కేంద్రం చేయాలని హరీష్ రావు అన్నారు. అంతే కాదు, 70లక్షల టన్నుల మిర్చీ దిగుబడి వుంటే సెంట్రల్ గవర్నమెంట్ కేవలం 3లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తాననటం పెద్ద జోక్ అన్నారు. దానికి కూడా 5వేల మద్దతు ధర నిర్ణయించటం తమకు ఎంత మాత్రం అంగీకారం కాదని చెప్పుకొచ్చారు!

 

మిర్చీ మద్దతు ధర నిర్ణయించటం… రైతుల ఆందోళన విరమింపజేయటం… కేంద్రం బాధ్యత కూడా. కాని, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా మోదీ సర్కార్ పై నెపం తోసి తాము తప్పుకుందామంటే వీలు కాదు. రైతులు తాము ఓటు వేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తారు. తెలంగాణ మిర్చీ మార్కెట్లో అదే జరుగుతోంది. అంతకంతకూ కేసీఆర్ వ్యతిరేక నినాదాలు పెరిగిపోతున్నాయి. ఎంత త్వరగా రైతులకు మేలు చేసే నిర్ణయం తీసుకుంటే అంత మంచిది. అలా కాకుండా ఒక రోజు మిర్చీ రైతుల్ని ఎవరు రెచ్చగొడుతున్నారో మాకు తెలుసుననీ… ఇంకో రోజు కేంద్రం ఆదుకోవాలే తప్ప రాష్ట్రం ఏం చేయలేదనీ… ఇలా రకరకాల స్టేట్మెంట్ లు ఇస్తే రైతన్నలు ఊరుకోరు! కేంద్రం బాధ్యత నిజంగానే వున్నా… తమకు మద్దతు ధర రాకపోవటం రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమనే అనుకుంటారు కర్షకులు. ఎందుకంటే, ఇదేదో పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోటం లాంటి పూర్తి అంశం కాదు. రైతుల సమస్యలు ఎలా చూసినా రాష్ట్రాలే చొరవ చూపి పరిష్కరించాలి!

 

మద్దతు ధర విషయంలో చాలా రాష్ట్రాల్లో రైతులు అసంతృప్తితోనే వున్నారు. కాని, గతం పరిశీలిస్తే ఆ ఎఫెక్ట్ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వంపై పడుతోందే తప్ప కేంద్రం పై కాదు. దీన్ని గ్రహించి తెలంగాణ సర్కార్ మిర్చీ రైతుని ఎలా ఆదుకోవాలో నిజాయితీగా ఆలోచించాలి. కేంద్రం పై ఘాటైన విమర్శలు ఎన్నైనా చేసుకోవచ్చు. కాని, మిర్చీ రైతుల ఘాటును తప్పించుకోవటం మాత్రం సులువు కాదు!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu