Latest News
అమానుషం.. అన్నం ప్లేటులో చేతులు కడిగినందుకే యువకుడి హత్య
posted on: Jan 21, 2026 9:27AM
.webp)
ప్లేట్ లో చేతులు కడిగిన విషయంపై తలెత్తిన ఘర్షణ ఏకంగా ఒక యువకుడి హత్యకు దారి తీసిన అమానుష సంఘటన సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఉస్మాన్ నగర్‌లోని హోమ్ ట్రీ అపార్ట్ మెంట్స్‌లో నివసిస్తున్న కార్పెంటర్ శ్యామ్ పంచాలు (28) అన్నం ప్లేటులో చేతులు కడిగిన విషయమై జరిగిన వాగ్వాదంలో హత్య కు గురయ్యాడు.
పోలీసుల కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జాలున్ జిల్లా గోరాంగ్ గ్రామానికి చెందినశ్యామ్ పంచాలు వృత్తిరీత్యా కార్పెంటర్.గత మూడు రోజులుగా ఉస్మాన్‌నగర్‌లోని హోమ్ ట్రీ అపార్ట్ మెంట్స్‌లో మిథ్లేష్ కుమార్, అతుల్ సహానీ అనే ఇద్దరు సహోద్యోగులతో కలిసి నివసిస్తున్నాడు.
సోమవారం (జనవరి 19) ఉదయం ముగ్గురు కలిసి భోజనం చేస్తుండగా, శ్యామ్ పంచాలు అతుల్ సహానీ ప్లేటులో చేతులు కడిగిన విషయం వివాదానికి దారితీసింది. వివాదం ముదిరి ఘర్షణకు దారి తీసింది. ఆగ్రహానికి గురైన అతుల్ సహానీ గుర్తు తెలియని వస్తువుతో శ్యామ్ పంచాలాపై దాడి చేశాడు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్యామ్ పంచాల అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడు అతుల్ సహానీని అదుపులోనికి తీసుకున్నారు.






