తుమ్మలను ఇరికించడానికి కుట్ర జరుగుతోందా?

 

గత ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నాయన్న ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టే ఇప్పుడు రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ మంత్రిగా ఉన్న తుమ్ముల నాగేశ్వరరావుకు కాళేశ్వరం బురద అంటించాలని చూస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి . కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఈటల రాజేందర్ ఇచ్చిన వాంగ్మూలం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారుతోంది. తన మెడకు చుట్టుకోకుండా ఉండటం కోసమో, కేసీఆర్‌ను ఇరికించడం ఇష్టం లేకో ఈటల రాజేందర్ .. అసలు తప్పే జరగలేని వాంగ్మూలం ఇచ్చారు. అన్నీ మంత్రి వర్గ నిర్ణయాల ప్రకారమే జరిగాయన్నారు. 

మూడు బ్యారేజీలు కట్టాలని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుందన్నారు. అప్పటి మంత్రివర్గ ఉపసంఘంలో తుమ్మల నాగేశ్వరరావు కూడా సభ్యులు. అందుకే ఆయన రియాక్ట్ అయి కౌంటర్ ఇచ్చారు, ఈటల వాంగ్మూలం ఇచ్చినట్లుగా ఆ ఉపసంఘం.. మూడు బ్యారేజీలు నిర్మించాలని ఎలాంటి సిఫారసులు చేయలేదని స్పష్టం చేశారు. ఆ ఉపసంఘం నివేదిక ఇవ్వక ముందే.. మూడు ప్యారేజీల నిర్ణయం జరిగిపోయిందని స్పష్టం చేశారు. అసలు కాళేశ్వరంకు కేబినెట్లో అనుమతి కూడా తీసుకోలేదని, కావాలంటే తానే కాళేశ్వరం కమిషన్ కు ఓ లేఖ రాస్తానని ప్రకటించారు. అవసరమైతే వాంగ్మూలం కూడా ఇస్తానన్నారు.బీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో కీలక మంత్రులుగా పని చేసిన ఇద్దరూ ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. 

బీజేపీ ఎంపీగా ఈటల ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా తుమ్మల ఉన్నారు. అటు రాజేందర్ ను కేసీఆర్ అవమానకరంగా.. కుట్రలు చేసి మరీ పార్టీ నుంచి బయటకు పంపారు. తుమ్మల నాగేశ్వరరావు తిరుగుబాటు చేసి బయటకు వచ్చారు. పంతం పట్టి తన సొంత జిల్లా ఖమ్మంలో బీఆర్ఎస్‌కు స్థానం లేకుండా చేశారు. కాళేశ్వరం విషయంలో ఈటల రాజేందర్ కేసీఆర్‌ను రక్షించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే తుమ్మలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వక్తమవుతోంది. కాళేశ్వరం విషయంలో కర్త, కర్మ , క్రియ కేసీఆర్ అనేది బహిరంగరహస్యం. ఆయనే ప్రాజెక్టుల రీ డిజైన్ చేశారు. ఇప్పుడు ఈటల ఆయన కోసం తుమ్మలకు బురద అంటించాలని చూడటం విమర్శల పాలవుతోంది.