Latest News

బ‌డి భోజ‌నం బాగా లేక‌పోతే క‌ఠిన‌చ‌ర్య‌లు : మంత్రి లోకేష్

posted on: Mar 13, 2026 8:38PM

 

బంగారు భ‌విష్య‌త్తు ఉన్న పిల్ల‌ల‌కు బడిలో పెట్టే భోజ‌నం రుచి, శుచి, నాణ్య‌త‌, పోష‌క విలువ‌లు త‌గ్గితే, బాధ్యుల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హెచ్చ‌రించారు. ఎన్టీఆర్ జిల్లా మైల‌వ‌రంలో అధ్వాన భోజ‌నం అంటూ పిల్ల‌ల‌తో డ్రామా ఆడించిన హెడ్మాస్ట‌ర్ ఉదంతంతో  విద్యాశాఖాధికారుల‌తో మంత్రి ఫోన్‌లో స‌మీక్ష నిర్వ‌హించారు.  

మైలవరం పట్టణంలోని తారక రామానగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం బాగాలేదని స్వయంగా హెచ్ఎం జాన్ విద్యార్థులను తప్పుదారి పట్టించి, కుట్ర‌పూరితంగా సోషల్ మీడియా ద్వారా ప‌థ‌కంపై దుష్ప్ర‌చారం చేశార‌ని త‌మ ద‌ర్యాప్తులో తేలింద‌ని అధికారులు మంత్రికి వివ‌రించారు. ఇటువంటి కుట్ర‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్టాల‌ని మంత్రి సూచించారు. మ‌న పిల్ల‌ల‌కు పెట్టే భోజ‌నానికి ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటామో, అంత‌కంటే ఎక్కువ‌గా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు పెట్టే మ‌ధ్యాహ్న భోజ‌నంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.
  
భోజ‌నం సిద్ధం అయ్యాక ప్ర‌తీరోజూ ముందుగా ఒక టీచ‌ర్ నాణ్యత చూడాల‌ని, బాగుంద‌ని నిర్ధారించాక విద్యార్థుల‌కు వ‌డ్డించాల‌ని సూచించారు. సమూల మార్పు కోసం త్వరలోనే సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. వారంలో ఒక‌రోజు ఎమ్మెల్యేలు త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో ఏదో ఒక స్కూలుకి వెళ్లి మ‌ధ్యాహ్న భోజ‌నం పిల్ల‌ల‌తో క‌లిసి తినాల‌ని కోరారు.

 దీనివ‌ల్ల లోటుపాట్లు స‌రిదిద్దుకునే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. పిల్ల‌లు భోజ‌నం గురించి త‌ల్లిదండ్రుల‌కు చెబితే, వారు వెంట‌నే లీప్ యాప్ ద్వారా ఫిర్యాదులు, ఫీడ్ బ్యాక్ అందించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అప‌ర అన్న‌పూర్ణ‌మ్మ డొక్కాసీత‌మ్మ పేరుతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కంలో ఏ చిన్న నిర్ల‌క్ష్యాన్ని క్ష‌మించేది లేద‌ని తేల్చి చెప్పారు. అలాగే ఎవ‌రైనా వ్య‌క్తిగ‌త‌, రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ప‌థ‌కంపై ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...