కోవా బన్ వ్యాపారి వలీకి...మంత్రి లోకేశ్ భరోసా

posted on: Feb 15, 2026 3:17PM

 

మేడారం జాతరలో కర్నూలుకు చెందిన ఓ చిరు వ్యాపారి వేధింపులకు గురైన ఘటనపై మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ బాధితుడైన వలీకి బహిరంగంగా క్షమాపణ తెలిపారు. వివరాల్లోకి వెళితే… కర్నూలు జిల్లాకు చెందిన వలీ అనే చిరు వ్యాపారి మేడారం జాతరలో కోవా బన్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ సమయంలో కొందరు యూట్యూబర్లు అతడిని అడ్డుకుని, “ఫుడ్ జిహాద్” చేస్తున్నావంటూ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా బలవంతంగా కోవా బన్ తినిపించిన ఘటన కలకలం రేపింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివిధ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేశ్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ… “ప్రియమైన సోదరుడు వలీ , మీకు ఈ బాధ కలగడం ఎంతో విచారకరం. ఇలాంటి విభజనకర, మతవివక్ష ప్రవర్తనకు మన తెలుగు సమాజంలో స్థానం లేదు. మన సమాజం ఎప్పుడూ సామరస్యం, పరస్పర గౌరవం, సోదరభావంతో నిలుస్తుంది” అని పేర్కొన్నారు. అలాగే, “త్వరలో మిమ్మల్ని కలిసి మీ ఫేమస్ కోవా బన్ రుచి చూడాలని ఉంది. మనమంతా కలిసి ఉండాలి” అంటూ వలీకి భరోసా ఇచ్చారు. మంత్రి స్పందనపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...