అమెరికా నుంచి భారత్‌కు చేరిన వేల ఏళ్ల నాటి కళాఖండాలు

posted on: May 7, 2026 3:00PM

పురావస్తు సంపద రక్షణలో సరికొత్త అధ్యాయం

భారతదేశ అపారమైన సాంస్కృతిక వైభవానికి ప్రతీకలైన పురాతన కళాఖండాలు తిరిగి మాతృభూమికి చేరుకుంటున్నాయి. అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ల ద్వారా అక్రమంగా విదేశాలకు తరలిపోయిన వందలాది పురావస్తువులను అమెరికా ప్రభుత్వం ఇటీవల అధికారికంగా భారత ప్రభుత్వానికి అప్పగించింది. సుమారు 14 మిలియన్ డాలర్లు అంటే దాదాపు  116 కోట్లరూపాయలల విలువైన 657 అరుదైన వస్తువులను భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంది.  భారత సాంస్కృతిక వారసత్వ పునరుద్ధరణ యాత్రలో ఒక  కీలక  మైలురాయి అనడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ 28న న్యూయార్క్‌లో జరిగిన ఒక ప్రత్యేక దౌత్య కార్యక్రమంలో ఈ కళాఖండాలను భారతీయ ప్రతినిధులకు అందచేశారు.  ఈ భారీ స్వాధీన ప్రక్రియలో వివిధ కాలాలకు, వివిధ ప్రాంతాలకు చెందిన అద్భుతమైన కళాఖండాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా శైవ, శాక్తేయ,  గాణాపత్య సంప్రదాయాలకు ప్రతిబింబాలుగా నిలిచే శివ-పార్వతుల విగ్రహం, బహుముఖాలు,  బాహువులతో అలరారుతున్న గణపతి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ విగ్రహాలు కేవలం రాతి చెక్కడాలు మాత్రమే కాదు.. ఆయా కాలాల్లోని భక్తి ఉద్యమాలకు, ఆలయ సంస్కృతులకు,  స్థానిక సమాజాల గుర్తింపునకు సజీవ సాక్ష్యాలు. 

శిల్పాలపై ఉన్న ఆభరణాల శైలి, ముఖ కవళికలు,  శరీర భంగిమలు అప్పటి శిల్పకళా నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నాయి.   దశాబ్దాలుగా భారత పురాతన సంపదను కొందరు స్మగ్లర్లు  వైట్ కాలర్ క్రైమ్ పేరుతో దొంగతనంగా విదేశాలకు తరలిస్తున్నారు. పురాతన ఆలయాల నుంచి విగ్రహాలను దొంగిలించడం.. పురావస్తు తవ్వకాల్లో బయటపడిన నాణేలు, శాసనాలను అక్రమంగా   విక్రయించడం వంటి చర్యల ద్వారా మన చరిత్రను విచ్ఛిన్నం చేస్తున్నారు. ఇలా ఒక విగ్రహం దేశం దాటి వెళ్లడం అంటే.. అది కేవలం ఒక వస్తువును కోల్పోవడం కాదు, ఒక గ్రామం   ఆధ్యాత్మిక జ్ఞాపకాన్ని,  ఒక నాగరికత   మూలాలను కోల్పోవడమేనని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు ఈ వస్తువులు తిరిగి రావడం వల్ల కోల్పోయిన ఆ గుర్తింపు మళ్లీ లభిస్తోంది.  ఈ భారీ విజయం వెనుక భారత్, అమెరికా దేశాల మధ్య ఉన్న పటిష్టమైన దౌత్య, న్యాయ సంబంధాలు ఉన్నాయి. అమెరికాలోని హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్, కస్టమ్స్ విభాగం,  భారత విదేశాంగ శాఖ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా  సంయుక్తంగా చేసిన సుదీర్ఘ పోరాటం వల్లనే ఇది సాధ్యమైంది. నకిలీ పత్రాలతో గ్యాలరీలలో దాచిన వస్తువులపై హక్కులను నిరూపించడం, చారిత్రక ఆధారాలను సమర్పించడం వంటి సంక్లిష్ట ప్రక్రియల తర్వాతే ఈ 657 కళాఖండాల అప్పగింత సాధ్యమైంది.  

ఈ ప్రక్రియను సాంకేతికంగా  రిపాట్రియేషన్ అంటారు. ఇది కేవలం వస్తువుల మార్పిడి మాత్రమే కాదు..అంతర్జాతీయ వేదికపై భారతదేశం తన సాంస్కృతిక హక్కులను ఎంత బలంగా వినిపిస్తోందో చెప్పడానికి  ఉదాహరణ. ఇటీవల కాలంలో యూరోప్, అమెరికా వంటి దేశాల నుంచి వందలాది వస్తువులను భారత్ విజయవంతంగా వెనక్కి తీసుకురాగలిగింది. యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థల నిబంధనలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ.. అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల సహకారాన్ని భారత్ పొందుతోంది.  భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దేశీయంగా కూడా కఠిన చర్యలు అవసరమని అధికారులు భావిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోని దేవాలయాలు, పురావస్తు ప్రాంతాల వద్ద భద్రత  పెంచడం, స్థానిక ప్రజల్లో తమ వారసత్వం పట్ల అవగాహన కల్పించడం వంటివి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విగ్రహాల దొంగతనం అనేది ఆస్తి నష్టం కాదు, అది సంస్కృతికి జరుగుతున్న తీరని ద్రోహం అనే భావన ప్రతి ఒక్కరిలో కలగాల్సి ఉంది.  తిరిగి వచ్చిన ఈ 657 పురావస్తు కళాఖండాలనూ త్వరలోనే భారత ప్రభుత్వం ప్రత్యేక ప్రదర్శనల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. వివిధ మ్యూజియంలు,  దైవ ప్రార్థనా స్థలాల్లో వీటిని శాశ్వతంగా భద్రపరిచే అవకాశం ఉంది. ఇవి సందర్శకులకు తమ అపహరణకు గురైన గతాన్ని,  తిరిగి మాతృభూమికి చేరిన విజయగాథను మౌనంగా వివరిస్తాయి. తన ఇంటికి తాను చేరుకుంటున్న భారతీయ సాంస్కృతిక యాత్రలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోనుంది.  

- సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లైతే  https://www.teluguone.comను లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.

google-ad-img
    Related Sigment News
    • Loading...