తాడేపల్లిలో ప్రైవేట్ భూమిలో జగన్ హెలీపాడ్ : సీఎం చంద్రబాబు

posted on: Feb 6, 2026 6:17PM

 

వైసీపీ హయాంలో లక్ష ఎకరాల ప్రైవేట్ భూములను ప్రభుత్వ భూముల రికార్డుల్లో పెట్టారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.  కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరై, రాజ ముద్రతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాడేపల్లి సమీపంలో 10 ఎకరాల ప్రైవేట్ భూమిని హెలిప్యాడ్‌గా మార్చుకున్నారంటూ  జగన్ ఆగడాలను ఎండగట్టారు. 

70 ఏళ్ల రికార్డున్న ఆ భూమిని ప్రభుత్వ భూమిగా రికార్డులు మార్చారని తెలిపారు. జీవితంలో ఎవరూ మీ భూమి మీద కన్ను వేయకుండా రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. క్యూ ఆర్ కోడ్ వల్ల సెల్ ఫోన్‌‌లో మీ భూమి మీకు కనిపిస్తుందని వివరించారు. తాను నాలుగో సారి ముఖ్యమంత్రిని అయ్యానని.. ఇప్పటి వరకు తన జీవితంలో ఇన్ని భూ సమస్యలు గతంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు.  పాసు పుస్తకాలపై జగన్ ఫోటో ఉండటాన్ని ప్రస్తావిస్తూ మీ భూమి మీద ఎవడి ఫోటోనో ఉండటం ఏంటని మండిపడ్డారు. 

ఏపీలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలన్నది తన సంకల్పమని స్పష్టం చేశారు. టెక్నాలజీకి అనుగుణంగా మార్చుకుంటూ వెళ్లాల్సి ఉందన్నారు. ఓర్వకల్లును తాను అభివృద్ధి చేస్తే.. వాళ్లు సర్వనాశనం చేశారన్నారు. అయినా.. మీ వారసత్వ భూమిపై వైఎస్ జగన్ ఫొటో ఏమిటని రైతులను ఆయన సూటిగా ప్రశ్నించారు. అందుకే రాజముద్రతో కొత్త పుస్తకాలు ఇచ్చి.. మీకు మళ్లీ హక్కు కల్పించానని వివరించారు. మీ జుట్టు జగన్ తన చేతుల్లో పెట్టుకుని పాలించాడని విమర్శించారు. పిల్లలు స్కూల్‌కి వెళ్లితే.. ఆయన ఫొటో చూడాలి.. పొలానికి వెళ్లితే ఆయన ఫొటో చూడాలనే విధంగా జగన్ ఏర్పాటు చేశారన్నారు. ఈ దుర్మార్గుడి ఫొటో చూడాల్సిన పని ప్రజలకు ఏముందని ఆయన ప్రశ్నించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...