ఉపాధి హామీపై కేంద్రం కుట్ర...పేదల కడుపుపై కత్తి : షర్మిల

posted on: Feb 8, 2026 12:43PM

 

మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపోలూరు పంచాయతీలో ఏఐసీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. గ్రామీణ కార్మికుల మధ్య నిలబడి షర్మిల కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం తీసుకొచ్చిన చారిత్రాత్మక ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం వ్యవస్థాపితంగా బలహీనపరుస్తోందని షర్మిల మండిపడ్డారు. 

పథకం పేర్లు మార్చి, రోజులు పెంచుతున్నట్టు చెప్పి పేదలను మోసం చేస్తున్నారని, వాస్తవానికి వారి హక్కులను కుదించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. 8 గంటల పనిని 12 గంటలుగా మార్చడం కార్మికులపై బానిస వ్యవస్థ మోపినట్టే కాదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి నిధులు ఇవ్వాల్సింది పోయి రాష్ట్రాలపై 40 శాతం భారం మోపడం పేదలపై యుద్ధం ప్రకటించినట్టేనని తీవ్రంగా విమర్శించారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని గుర్తుచేశారు షర్మిల. 

ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామీణ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని, రహదారులు దారుణంగా మారాయని, ఆరోగ్యశ్రీ కూడా బలహీనపడిందని ఆరోపించారు. గ్రామాల్లో పాఠశాలలు, అభివృద్ధి పనులు తగ్గి బెల్ట్ షాపులు పెరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే పేదల సంక్షేమం బలపడుతుందని, రాష్ట్రం మరియు దేశం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందని షర్మిల స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం కోసం పోరాటం ఆగదని, పేదల హక్కుల కోసం కాంగ్రెస్ వీధుల్లోకి వస్తుందని హెచ్చరించారు.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...