భారీ పేలుడు... 23 మంది మృతి
posted on Nov 2, 2025 10:52AM
.webp)
మెక్సికోలోని ఓ సూపర్ మార్కెట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. రాష్ట్ర గవర్నర్ అల్ఫోన్సో డురాజో ఈ ఘటనను ధ్రువీకరించారు.
పేలుడు సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పేలుడుకు గల స్పష్టమైన కారణం ఇంకా తెలియరాలేదు.మెక్సికో రాష్ట్ర గవర్నర్ అల్ఫోన్సో ఈ ప్రమాద ఘటనపై వీడియో ద్వారా స్పందించారు. ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొంటూ, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
ఇక మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ కూడా ఎక్స్ ద్వారా స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. రాష్ట్ర గవర్నర్ అల్ఫోన్సోతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నట్లు వెల్లడించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, ఇందుకోసం రెస్క్యూ బృందాలను వెంటనే పంపించాలని అంతర్గత వ్యవహారాల కార్యదర్శి రోసా ఐసెలా రోడ్రిగ్జ్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.