Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వైసీపీకి మెటా షాక్.. వెనుక నిజాలివే!
posted on: Jun 16, 2026 5:33PM
.webp)
తెలుగువన్ స్పెషల్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న యుద్ధం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. వైసీపీ అధికారిక సోషల్ మీడియా పేజీలను మెటా బ్లాక్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ పరిణామంపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యంపై, భావప్రకటన స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభివర్ణించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తోందని ఆరోపిస్తూ.. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి కార్యాలయం, మెటా యాజమాన్యానికి ఆయన 'ఎక్స్' వేదికగా ట్యాగ్ చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులలో అధిక వ్యయాలు, డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలు, టీటీడీ నెయ్యి టెండర్లలో అక్రమాలపై తాము సాక్ష్యాలతో నిలదీస్తుంటే తట్టుకోలేక ఈ చర్యలకు పాల్పడ్డారని జగన్ విమర్శించారు.
అయితే.. ఈ ఆరోపణలను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ తీవ్రంగా ఖండించారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. మెటా సంస్థ కేవలం ఒకరి ఫిర్యాదుతో ఓవర్ నైట్ ఏ అకౌంట్‌ను సస్పెండ్ చేయదని ఆయన చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను పదే పదే ఉల్లంఘించడం వల్లే ఈ బ్లాక్ జరిగిందని వివరించారు. ముఖ్యంగా ఇటీవల ముగిసిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియ డీఎస్సీ ద్వారా రికార్డు స్థాయిలో 15,941 మంది నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగాలు లభించాయనీ.. అయితే వైసీపీ నేతలు తప్పుడు ఆధారాలు, ఫేక్ ఆడియో క్లిప్పింగులతో సమాజంలో అస్థిరత సృష్టించడానికి ప్రయత్నించారని అప్పసాని రాజేష్ ఆరోపించారు. ఈ పరీక్షల కోసం టీసీఎస్ అయాన్ ద్వారా 42 వేల ప్రశ్నలతో కూడిన భారీ క్వశ్చన్ బ్యాంక్‌ను ఆన్‌లైన్ విధానంలో ఉపయోగించారని, దీనివల్ల పేపర్ లీక్ అవ్వడం సాంకేతికంగా అసాధ్యమని ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇచ్చినా విపక్షం తప్పుడు ప్రచారం ఆపలేదన్నారు.
అంతేకాకుండా.. మాజీ ఎమ్మెల్యే నందిగం సురేష్ అనుచరుడు బొంత రోశయ్య అనే వ్యక్తి ద్వారా ఒక నకిలీ ఆడియో క్లిప్‌ను సృష్టించి, సోషల్ మీడియాలో వైరల్ చేశారని టీడీపీ ఆధారాలతో సహా మెటా సంస్థకు ఫిర్యాదు చేసింది. గతంలో వైసీపీ హయాంలో న్యాయమూర్తులను సైతం దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన చరిత్ర వారిదని, అందుకే అప్పట్లో హైకోర్టు ఏకంగా సిబిఐ విచారణకు ఆదేశించిందని అప్పసాని రాజేష్ గుర్తుచేశారు.
ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రులపై మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకరంగా ప్రచారం చేస్తూ, దానిని భావప్రకటన స్వేచ్ఛగా చిత్రీకరించడం హాస్యాస్పదమన్నారు. ఒకవేళ ఇదే ధోరణి సాగితే అబద్ధాలను ప్రచారం చేసే సాక్షి పత్రిక సర్క్యులేషన్‌ను కూడా నియంత్రించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ బ్లాక్ అనేది ప్రజాస్వామ్య అణచివేత కాదని, ఫేక్ న్యూస్ నెట్‌వర్క్‌పై మెటా తీసుకున్న చట్టపరమైన చర్య మాత్రమేనని ఆయన చెప్పారు. అయినా మెటా ఫిర్యాదు చేయగానే బ్లాక్ చేయదనీ, నిజానిజాలను నిర్ధారించుకుని వైసీపీకి నోటీసులు పంపించిన తరువాత కూడా అక్కడ నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడం వల్లే మెటా చర్య తీసుకుందన్నారు.



.webp)


