మేనకమ్మ కడుపు చల్లగా...

posted on: Feb 2, 2016 10:25AM


 

కడుపులో బిడ్డను కడుపులేనే కడతేర్చే దుష్టసంస్కృతికి నూకలు చెల్లిపోతున్నాయి. గర్భస్థ స్థాయి నుంచే ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఇదెలా సాధ్యం అని ఆశ్యర్యపోకండి. దీనికోసం ముందుగా లింగ నిర్ధారణ పరీక్షలపై నిషేధం తొలగిస్తారు. పుట్టే బిడ్డ ఆడా మగా అనేది ముందే తెలుసుకుంటారు. అలా పుట్టబోయే ఆడ శిశుల వివరాలు నమోదు చేస్తారు. పుట్టబోయేది పాప అయితే, గర్భస్రావం చేయించాలనుకునే భర్త అత్తమామల ఆటలు చెల్లకుండా వారిపై నిఘా ఉంచుతారు.

ప్రస్తుతం లింగనిర్ధారణ పరీక్షల మీద నిషేధం ఉన్నా అది అమలు కావడం లేదు. తల్లీబిడ్డల ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు డాక్డర్లు ఎప్పటికప్పుడు స్కానింగ్ చేయించుతారు. అయితే ఈ పరీక్షలో శిశువు ఆడా మగా అనేది తెలుస్తుంది. చట్టప్రకారం దీన్ని వెల్లడించరాదనే కఠిన నిబంధనలు అమల్లో ఉన్నా, డబ్బాశకు లోబడి కొన్ని డయాగ్నస్టిక్ సెంటర్లు లింగవివరాలు వెల్లడిస్తున్నాయి. దీంతో, ఎందరో పాపాయిలు పాపం ఈ లోకంలోకి రాకుండానే పరలోకాలకు పయనం కడుతున్నారు.

గర్భస్థ పాపాయిలను కడతేర్చడం అమానుషం మాత్రమే కాదు. సామాజికంగా ఎన్నో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీని దుర్వినియోగం అవుతున్న కారణంగా దేశంలో ఏటికేడాది ఆడమగ నిష్పత్తి తగ్గిపోతోంది. దేశవ్యాప్తంగా ప్రతి వెయ్యి మందికి కేవలం 943 మందే ఆడపిల్లలు ఉంటున్నారు. హర్యానాలో అయితే  ఈ నిష్పత్తి 1000 మందికి 889 మాత్రమే ఉంది. ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కాకున్నా, ఈ రేషియోను పెంచే దిశగా ప్రభుత్వం చేస్తున్న ఆలోచన హర్షణీయం. లింగనిర్ధారణపై నిషేధం ఎత్తేసి పుట్టబోయే పాపాయిలకు ఒక నేషనల్ రిజిస్టర్ నిర్వహించి వారికి రక్షణ కల్పిస్తామని కేంద్ర మహిళాశిశు అభివృద్ధి మంత్రి మేనకా గాంధీ చేసిన ప్రకటనకు పుట్టబోయే పాపాయిలు రుణపడి ఉంటారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...