బొగ్గు గని పేలుడు...16 మంది మృతి
posted on: Feb 5, 2026 8:22PM

మేఘాలయ రాష్ట్రంలో అక్రమ బొగ్గు తవ్వకాలు మరోసారి భారీ ప్రాణ నష్టానికి కారణమయ్యాయి. తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలోని ఓ గనిలో బొగ్గు తవ్వుతుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెస్య్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ గనిని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే పేలుడికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. మేఘాలయలో ర్యాట్ హోల్ మైనింగ్ చేస్తూ అశాస్త్రీయ పద్ధతుల్లో తవ్వకాలు జరుపుతున్నారు. అయితే, ఈ తవ్వకాలను 2014 నుంచి జాతీయ హరిత ట్రైబ్యునల్ నిషేధించింది. ర్యాట్ హోల్ అంటే.. సమాంతరంగా సన్నని గుంత తవ్వుతూ బొగ్గును బయటకు వెలికి తీసే పద్ధతి. సుమారు 3, 4 అడుగుల వెడల్పుతో ఈ గుంతలు ఉంటాయి. అచ్చం ఎలుకలు బొరియలు తవ్వినట్టుగా ఉంటాయి కాబట్టి దీనికి ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అనే పేరు వచ్చింది. ఇటీవల ఈ తవ్వకాలపై ఎన్జీటీ నిషేధాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.
ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి" అని పేర్కొన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ఈ ప్రమాదంపై మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా స్పందిస్తూ, ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించిందని ప్రధాని తెలిపారు. బాధ్యులను గుర్తించి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.






