మీనాక్షి నటరాజన్‌‌కు భారీ షాక్... సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

posted on: Jun 12, 2026 2:59PM

 

కాంగ్రెస్ నేత  మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదరైంది. మధ్యప్రదేశ్‌ రాజ్యసభ  నామినేషన్ తిరస్కరించడంపై దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. దానికి విచారణ అర్హత లేదని, ఆర్‌ఓ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని  అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో, రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయాలపై న్యాయస్థానాలు నేరుగా జోక్యం చేసుకునే పరిధి అత్యంత పరిమితంగా ఉంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఏఎస్ చంద్రుర్కర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కీలక పిటిషన్‌పై విచారణ జరిపింది.

రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయంపై ఏవైనా అభ్యంతరాలు లేదా అసంతృప్తి ఉంటే, దానికి సంబంధించిన చట్టపరమైన వేదికలను ఆశ్రయించాలని ధర్మాసనం సూచించింది. ఇలాంటి ఎన్నికల వివాదాల విషయంలో సాధారణంగా అందుబాటులో ఉండే రాజ్యాంగబద్ధమైన మార్గాల ద్వారా భారత ఎన్నికల కమిషన్‌ను (ECI) సంప్రదించడమే ఉత్తమమని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.

అసలు వివాదం ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రంలో నమోదైన ఒక పాత కేసు వివరాలను మీనాక్షి నటరాజన్ తన ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరచలేదనే కారణంతో అక్కడి రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. దీనిని తీవ్రంగా తప్పుబడుతూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది.

కాంగ్రెస్ పార్టీ తరఫున కోర్టులో వాదనలు వినిపించిన ప్రముఖ సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ.. సదరు కేసులో కేవలం ప్రాథమిక నోటీసులు మాత్రమే జారీ అయ్యాయని ధర్మాసనానికి వివరించారు. ఆ కేసుపై ఎలాంటి పోలీసు దర్యాప్తు కానీ, కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేయడం కానీ జరగలేదని, అందువల్ల దీనిని పూర్తి స్థాయి క్రిమినల్ కేసుగా భావించి నామినేషన్‌ను రద్దు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని వాదించారు. అయితే ఈ వాదనలను సుప్రీంకోర్టు అంగీకరించలేదు.

మరోవైపు ఈ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్షాల అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడానికి, ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించడానికి అధికార బీజేపీ కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...