మెదక్ సీటు కోసం కాంగ్రెస్ ఆరాటం
posted on: Sep 1, 2014 10:37PM
.png)
తెలంగాణా ఇచ్చిన కారణంగా తెలంగాణా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకే గంపగుత్తగా ఓట్లేసేస్తారని దురాశకు పోయి భంగపడిన టీ-కాంగ్రెస్ పార్టీ నేతలు ఈసారి ఎలాగయినా మెదక్ ఉపఎన్నికలలో పార్టీ అభ్యర్ధి సునీతా లక్ష్మా రెడ్డిని గెలిపించుకొని తమ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. తమ భరోసాతో రాష్ట్ర విభజనకు పూనుకొని తీవ్రంగా నష్టపోయానని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానికి మెదక్ సీటును గెలుచుకొని బహుమతిగా అందివ్వాలని టీ-కాంగ్రెస్ నేతలు కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకే ఈసారి టీ-కాంగ్రెస్ నేతలు ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ విబేధాలను పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేసేందుకు సిద్దం అవుతున్నారు. అయితే తెరాస అధినేత కేసిఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టినప్పటికీ, ప్రజలను ఆకట్టుకొనే విధంగా చాలా దూకుడుగా పరిపాలన కొనసాగిస్తునందున తెరాసపై కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించడం కొంచెం కష్టమేనని చెప్పక తప్పదు. అదీగాక కేసీఆర్ రాజీనామాతో ఖాళీ అయిన మెదక్ లోక్ సభ సీటును ఎలాగయినా తిరిగి దక్కించుకోవాలని తెరాస కూడా చాలా పట్టుదలగా ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అభ్యర్ధి విజయం కోసం మరింత చెమటోడ్చక తప్పదు. కాంగ్రెస్, తెరాసలు చాలా బలమయిన అభ్యర్ధులు నిలబెట్టి చాలా గట్టిగా కృషి చేస్తునందున, కొత్తగా బీజేపీలోకి చేరి ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న జగ్గారెడ్డి వారి ముందు చాలా బలహీన అభ్యర్ధిగా కనిపిస్తున్నారు. అందువలన బహుశః పోటీ ప్రధానంగా తెరాస, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉండవచ్చును.



.jpg)
.jpg)

.webp)



