బంగ్లాదేశ్ లో మశూచి మరణమృదంగం.. భారత్ కూ వ్యాపించే ప్రమాదం!

posted on: Apr 29, 2026 10:46AM

బంగ్లాదేశ్‌ను మీజిల్స్ (మశూచి)  మహమ్మారి వణికిస్తోంది. గడిచిన కొన్ని వారాల్లోనే ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి దాదాపు 300మందికి పైగా మరణించారు.  మృతులలో అత్యధికులు చిన్నారులే. గత రెండు దశాబ్దాలలో ఇంతటి తీవ్రమైన స్థాయిలో మీజిల్స్ వ్యాపించడం ఇదే మొదటిసారి.   దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో  కేసులు నమోదవుతుండటంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. 

అందుబాటులో ఉన్న సమాచారం మేరకు  బంగ్లాదేశ్‌లోని 64 జిల్లాలకు గానూ 58 జిల్లాల్లో మీజిల్స్ వేగంగా విస్తరిస్తోంది.  దాదాపు 90 శాతం దేశం మీజిల్స్  ప్రభావానికి గురైంది. మార్చి మధ్య కాలం నుండి ప్రారంభమైన ఈ వ్యాప్తి ఉధృతి   ఏప్రిల్ ఆఖరు నాటికి పతాక స్థాయికి చేరింది. సుమారు 30 వేల మందికి పైగా చిన్నారులు.. మీజిల్స్ లక్షణాలతో బాధపడుతుండగా, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.   పోషకాహారలోపం ఉన్న పిల్లలు మీజిల్స్ బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. 

ఈ స్థాయిలో మీజిల్స్ ప్రబలడానికి గత రెండేళ్లుగా బంగ్లాదేశ్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కుంటుపడటమే  కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  2024లో దేశంలో ఏర్పడిన రాజకీయ అస్థిరత, నిరసనల కారణంగా అప్పట్లో జరగాల్సిన సామూహిక టీకా కార్యక్రమాలు జరగలేదు. దీనికి తోడు వ్యాక్సిన్ల కొరత కూడా తోడవడంతో చిన్నారులలో రోగనిరోధక శక్తి తగ్గిపోయిందంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తోంది. తగిన సమయంలో బూస్టర్ డోసులు అందించకపోవడం వల్ల  మీజిల్స్ వ్యాప్తి తీవ్రత అధికంగా ఉందని చెబుతున్నారు. 

కాగా మీజిల్స్ వ్యాధి తీవ్రత, వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ  కీలక ప్రకటన చేసింది. మీజిల్స్ బంగ్లాదేశ్ పొరుగున ఉన్న మయన్మార్, భారత్ వంటి దేశాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.    బంగ్లాదేశ్ నుండి ఇండియా, మయన్మార్ వంటి దేశాలకు జనాభా రాకపోకలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ వైరస్ సరిహద్దులు దాటే ప్రమాదం ఉందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..  ముఖ్యంగా కోల్‌కతా వంటి సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలని సూచించింది. మీజిల్స్ అనేది   గాలి ద్వారా సోకే, అత్యంత వేగంగా వ్యాపించే వ్యాధి కావడంతో అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రభుత్వం రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. సుమారు 1.8 కోట్ల మంది చిన్నారులకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే కొన్ని లక్షల మందికి అత్యవసర వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు.  రాబోయే రోజుల్లో ఈ మహమ్మారిని కట్టడి చేయకపోతే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలకు జ్వరం లేదా చర్మంపై దద్దుర్లు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తరలించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...