నోరు జారిన ఫలితం బీజేపీ అనుభవించాల్సిందేనా..?

posted on: Jul 21, 2016 5:22PM

దేశంలో ఏ రాష్ట్రానికి లేని ప్రాధాన్యత ఉత్తరప్రదేశ్‌కు ఉంది. కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలనుకునే ఏ పార్టీ అయినా యూపీలో నెట్టుకురాగలిగితే అధికార పీఠం ఖాయమని భావిస్తుంది. అందుకే ఆ రాష్ట్ర ఎన్నికలను మినీ భారత్ ఎన్నికలుగా భావిస్తుంటారు. గత సాధారణ ఎన్నికల్లో అనూహ్య విజయవం సాధించిన బీజేపీ వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రాబోయే 2019 ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తోంది. అందుకు తగ్గట్టుగానే కమలనాధులు స్కెచ్ రెడీ చేస్తున్నారు. అక్కడ పార్టీల భవితవ్యాన్ని నిర్దేశించే ప్రధాన కులాల మద్ధతు కూడగట్టే పనిలో అగ్రనేతలు తలమునకలై ఉన్నారు. దానిలో భాగంగానే మొన్న జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో యూపీకి ప్రాధాన్యత నిచ్చారు.

 

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఆదరణ పెరుగుతున్న తరుణంలో ఆ పార్టీ నేతల నోటీ దురుసు కమలాన్ని కోలుకోలేని స్థితిలోకి నెట్టింది. "డబ్బులు తీసుకున్న వేశ్య కూడా తాను ఒప్పుకున్న పనికి కట్టుబడి ఉంటుంది. కాని మాయావతి ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి టిక్కెట్లు అమ్మేస్తున్నారంటూ" బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై రేగిన దుమారం అంతా ఇంతా కాదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున సభ లోపల, బయట కూడా ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. దయాశంకర్ మాయావతికి క్షమాపణ చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు బీజేపీ అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఇంత చేసినా బీజేపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అనుకోవచ్చు.

 

ఎందుకంటే మాయవతి దేశంలో దళిత చైతన్యానికి ప్రతీక.. ఒక దళిత మహిళగా సగర్వంగా తిరుగుతూ, మంత్రులను, అధికారులను ఎడాపెడా మార్చేస్తూ చండశాసనురాలిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా దళితుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. పేద దళిత కుటుంబాలకు పింఛన్లు రెట్టింపు చేయడం, దళిత యువతుల వివాహాలకు రూ.10 వేల చొప్పున సాయం చేయడం వంటి చర్యలతో దళితుల హృదయాల్లో నిలిచిపోయారు. అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఉత్తరప్రదేశ్‌ రగిలిపోయింది. బీఎస్సీ శ్రేణులతో పాటు మాయావతి అభిమానులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు. పార్టీలకు ఎన్నికల వేళ ఏదైనా అంశం దొరికితే ఏకిపారేస్తాయి. అలాంటిది బీజేపీ పోయి పోయి మాయవతికి చేతికి చిక్కింది. ఈ ఎన్నికల్లో దళితుల్ని మరింత ఆకట్టుకోవడానికి, బీజేపీని టార్గెట్ చేయడానికి ఈ వ్యవహారం మాయకు వజ్రాయుధంలా ఉపయోగపడుతుంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...