పవర్ ప్లేలోనే మ్యాచ్ ఫలితం తేలిపోయింది.. టీమ్ ఇండియాపై సచిన్ ప్రశంసలు
posted on: Feb 16, 2026 8:04AM
.webp)
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 61 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమ్ ఇండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చిరకాల ప్రత్యర్థితో జరిగిన ఈ మ్చాయ్ లో టీమ్ ఇండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేయడమే కాకుండా.. సూపర్-8 దశకు అర్హత సాధించిన సంగతి విదితమే.
ఈ విజయంపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పవర్‌ప్లేలోనే భారత్ మ్యాచ్‌ను పాకిస్థాన్ నుంచి లాగేసుకుందని అన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా అభిషేక్ శర్మ త్వరగానే ఔటయినా మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్, ఇక పాక్ బ్యాటింగ్ చేపట్టిన తరువాత బౌలర్ల అద్భుత ప్రదర్శన మ్యాచ్ ను ఏకపక్షం చేసేశాయని సామాజిక మాధ్యమ వేదికలో సచిన్ టెండూల్కర్ పోస్టు పెట్టారు.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్, ఓపెనర్ ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77) మెరుపు ఇన్నింగ్స్‌తో భారీ స్కోరుకు పునాది వేసుకుందని, అనంతరం 176 పరుగుల విజలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ బ్యాటర్లను భారత బౌలర్లు ఏ మాత్రం కుదురుకోనివ్వకుండా వచ్చిన వారిని వచ్చినట్లు పెవిలియన్ కు పంపించారనీ సచిన్ ప్రశంసించాడు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా ధాటికి పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుందన్నాడు.






