‘మర్రి’యాద రామన్న!
posted on Nov 28, 2013 5:49PM
ఇద్దరు పోట్లాడుకుంటూ వుంటే ఇద్దరి మధ్యలో చేరి న్యాయమైన తీర్పు చెప్పే వ్యక్తిని మర్యాద రామన్న అని అంటారు. అయితే తెలంగాణవాదులు, సీమాంధ్రులు రాష్ట్ర విభజన కావాలి.. వద్దూ అని గొడవ పడుతూ వుంటే, ఆ గొడవని తనకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నించే వ్యక్తిని మాత్రం ‘మర్రి’యాద రామన్న అని పిలవొచ్చు.
ఆ ‘మర్రి’యాద రామన్న మరెవరో కాదు.. రెండుసార్లు రాష్ట్రాన్ని పరిపాలించిన మర్రి చెన్నారెడ్డి తనయుడు మర్రిశశిధర్‌రెడ్డి. విపత్తుల నివారణ వ్యవహారాలను చూసే మర్రి శశిధర్‌రెడ్డి ప్రకృతి వైపరీత్యాల్లాంటి విపత్తుల దగ్గరే ఆగిపోకుండా రాష్ట్ర విభజన విపత్తులోకి కూడా ఎంటరయ్యారు. మొన్నటి వరకూ సమైక్యవాదిగా వున్న తెలంగాణ బిడ్డ మర్రి శశిధర్‌రెడ్డి రాష్ట్రం విడిపోకుండా చూస్తారేమోలే అనుకుంటే ఆయన తన అసలు స్వరూపం చూపించి భయ పెడుతున్నారు.
ఇప్పుడాయన సమైక్యవాది రూపంలో కాకుండా... తెలంగాణ రావాలని, ఆ తెలంగాణకు తాను మొదటి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్న వ్యక్తిగా ముందుకు వచ్చారు. తన తండ్రి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తాను ఒక్కసారైనా సీఎం అవ్వాలని మర్రివారు కలలుకంటున్నట్టున్నారు. ముఖ్యమంత్రి పదవికి తనను తాను ప్రమోట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా శశిధర్‌రెడ్డి తెలంగాణలో వున్న అసెంబ్లీ నియోజకవర్గాలను 153కి పెంచాలని, లేకపోతే తెలంగాణలో రాజకీయ అస్థిరత్వం ఏర్పడుతుందని జీఓఎం దగ్గర మొత్తుకున్నారు. దీనిమీద మంత్రుల బృందానికి ఓ నివేదిక కూడా ఇచ్చారు.
ప్రస్తుతం ఆయన్ని ఎవరు పలకరించినా తెలంగాణలో నియోజకవర్గాల పెంపుదల గురించి వివరణలు, ఉదాహరణాలు, తార్కాణాలతో గంటలు గంటలు లెక్చర్లు ఇస్తున్నారట. 2014 ఎన్నికలలోపే నియోజకవర్గాల పునర్విభజన చేసేస్తే ఆ తర్వాత తెలంగాణ అభివృద్ధిలో ఎక్కడికో వెళ్ళపోతుందట. అలా చేయకపోతే రాజకీయ అస్థిరతతో తెలంగాణ మరో జార్ఖండ్‌లాగా దుంపనాశనం అయిపోతుందట. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చూరులో చుట్టకాలి ఇంకొకడు ఏడ్చాడంటారే... మర్రి శశిధర్‌రెడ్డి యవ్వారం కూడా అలాగే వుంది.