Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బుల్లెట్‌తో కాదు...బ్యాలెట్‌తో మార్పు : సీఎం రేవంత్
posted on: Mar 7, 2026 4:41PM

మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలకు మంచి ఫలితాలు వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల భారీ సంఖ్యలో మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోవడం రాష్ట్ర పోలీసుల ప్రత్యేక కృషికి నిదర్శనమని ఆయన అభినందించారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి హింస కాదు, ప్రజాస్వామ్య మార్గమే సరైనదని స్పష్టం చేశారు. బుల్లెట్‌తో కాకుండా బ్యాలెట్ ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనాలని నమ్మి ముందుకు వచ్చిన మావోయిస్టులకు ఆయన అభినందనలు తెలిపారు.
ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు చెందిన మొత్తం 130 మంది మావోయిస్టులు 124 ఆధునిక ఆయుధాలతో లొంగిపోయారని సీఎం వెల్లడించారు. దేశంలో ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఆయుధాలతో లొంగుబాటు కావడం ఇదే తొలిసారి అని చెప్పారు. 2024 జనవరి నుంచి ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 721 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు వివరించారు. లొంగిపోయిన మావోయిస్టుల ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని సీఎం తెలిపారు. వారికి ఆర్థిక సహాయం, పునరావాసం, మెరుగైన వైద్య సేవలు, నివాసానికి ఇండ్లు, ఇళ్ల స్థలాలు వంటి సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద గృహ సదుపాయం కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. హోదాలను బట్టి రివార్డులు కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు నాయకులు దేవ్ జీ, చంద్రన్న, సుజాతక్క, రాజిరెడ్డి తదితరులతో తాను చర్చలు జరిపినట్లు సీఎం తెలిపారు. వారి సమస్యలు, డిమాండ్లను వినామని, వాటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని చెప్పారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ముందుంచిన ప్రతిపాదనలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. మావోయిస్టు సమస్య కేవలం తెలంగాణకే పరిమితం కాని జాతీయ స్థాయి అంశమని సీఎం పేర్కొన్నారు. దీనిపై కేంద్రంతో సమన్వయం కొనసాగుతోందని తెలిపారు.
ఆయుధాలతో తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోయే వారికి పూర్తి భరోసా ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించినట్లు చెప్పారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత గణపతి సహా ఇతర కేంద్ర కమిటీ సభ్యులు కూడా ముందుకు వచ్చి లొంగిపోవాలని సీఎం పిలుపునిచ్చారు. గణపతి ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నట్లు సమాచారం ఉందని పేర్కొంటూ, ఆయన ఎక్కడ ఉన్నా ముందుకు వచ్చి లొంగిపోవాలని సీఎం పిలుపునిచ్చారు. వయస్సు, అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గణపతి లొంగుబాటు నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో హింసకు తావు లేదని సీఎం స్పష్టం చేశారు. ఆయుధాలతో బెదిరింపులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే శాంతియుతంగా లొంగిపోతే ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు.మహాత్మా గాంధీ శాంతియుత పోరాటం ద్వారా దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారని గుర్తుచేసిన సీఎం, ఎంత పెద్ద సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని అన్నారు. దేశాల మధ్య యుద్ధాలు కూడా చర్చల ద్వారానే పరిష్కారం అవుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జనజీవన స్రవంతిలో కలిసిపోతే ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.






