Latest News
మావోయిస్టు గణపతి లొంగుబాటుపై ఢిల్లీలో ప్రచారం!
posted on: Mar 11, 2026 3:42PM

దేశంలో దశాబ్దాల పాటు సాయుధ మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన సీపీఐ (మావోయిస్టు) మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి త్వరలో లొంగిపోవచ్చననే వార్తలు రాజకీయ, భద్రతా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో గణపతి లొంగిపోవచ్చననే ప్రచారం ఢిల్లీలో జోరుగా సాగుతోంది. దాదాపు 50 ఏళ్ల పాటు సీపీఐ మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహించిన గణపతి, ఇటీవల అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కాగర్ తరువాత ఆయన నేపాల్‌లో ఆశ్రయం పొందినట్లు ప్రచారం జరిగింది.
అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నారన్న వార్తలతో ఆయన లొంగుబాటు అంశం మరింత వేడెక్కింది. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యల కారణంగా గణపతి సాధారణ జీవితం గడపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలు స్తోంది. ఈ నేపథ్యం లోనే గణపతి తెలంగాణ పోలీసులతో రహస్యంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబు తున్నాయి. కుటుంబ సభ్యులు కూడా ఆయన ఉద్యమ జీవితానికి ముగింపు పలికి సాధారణ జీవితం గడపాలని కోరు తున్నట్లు చెపుతున్నారని సమాచారం. ఈ క్రమంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం గణపతితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
గణపతి లొంగుబాటు జరిగితే మావోయిస్టు ఉద్యమానికి ఇది పెద్ద దెబ్బగా మారే అవకాశముంది. అగ్ర నాయ కుల యుగానికి ముగింపు పలికే పరిణామంగా ఇది నిలుస్తోంది. 1949లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీర్పూర్‌లో జన్మించిన గణపతి, అసలు పేరు ముప్పాళ్ల లక్ష్మణరావు. ఉద్యమంలో ఆయనను సహచరులు “టీచర్” అని పిలిచేవారు. 1970 దశకం లో జగిత్యాల ప్రాంతంలో జరిగిన రైతాంగ పోరాటాల ద్వారా గణపతి నక్సలైట్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ తరువాత కొండపల్లి సీతారామయ్య తర్వాత ఆ స్థాయి నాయ కుడిగా ఎదిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.
2018లో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుండి ఆయన వైదొలి గారు. అయితే మావోయిస్టు నెట్వర్క్ విస్తరణలో గణపతి కీలక పాత్ర పోషించినట్లు భద్రతా సంస్థలు చెబుతు న్నాయి. ఆయన పర్యవేక్షణ లో దేశంలోని పలు సంచలన దాడులు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం గణపతి భార్య సుజాత కూడా ఉద్యమంలో కొనసాగుతున్నట్లు తెలిసింది. గణపతి స్వస్థలం ప్రస్తుతం జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల పరిధిలోని ప్రాంతంగా గుర్తించబడింది. ఇక గణపతి లొంగుబాటుపై అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు వెలువడలేదు. అయితే ఈ వార్తలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.


.webp)



