షెల్టర్ కోసం "అన్న"లు కూలీలయ్యారు..

posted on: Aug 12, 2016 5:42PM

సమసమాజ స్థాపన కోసం, బడుగుల అభ్యున్నతి కోసం ఆయుధం పట్టిన అన్నలు దశాబ్దాలుగా దేశంలో రక్తపుటేరులు పారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్ర ప్రభుత్వాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. 1967లో పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లా నక్సల్బరి ప్రాంతంలో భూమి కోసం పుట్టిన ఉద్యమం మహోగ్రరూపం దాల్చింది. కోర్టులో గెలుచుకున్న భూమిని దున్నుకోవడానికి గిరిజనులు ప్రయత్నిస్తుండగా నక్సల్బరీ గ్రామ భూస్వాములు అడ్డుతగిలారు. గిరిజనులపై దాడులు చేయించడంతో..అమాయక గిరిజనులు వారికి ఎదురుతిరిగారు. ఈ పోరాటంలో తొమ్మిది మంది గిరిజనులు చనిపోయారు. ఈ తిరుగుబాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఇలాగే భూస్వాములు కబంద హస్తాల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న వారిలో స్పూర్తి నింపి క్రమంగా నక్సలిజంగా మారిపోయింది.

 

ఈ ఉద్యమంలో 22 వేల మంది సాయుధ నక్సలైట్లు ఉన్నట్లు కేంద్ర గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2009లో దేశంలోని నక్సల్ గ్రూపులన్నీ కలిసి "మావోయిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా"గా అవతరించింది. అయితే క్రమేణా వీరి ఉద్యమం పక్కదారిపట్టి హింసాత్మకంగా మారింది. ప్రజాప్రతినిధులను హతమార్చడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంతో సర్కార్ నక్సలైట్లపై కన్నెర్ర చేసింది. ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరిట మావోలపై యుద్దం ప్రకటించింది. ముఖ్యంగా మావోల కంచుకోట దండకారణ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏరివేతకు శ్రీకారం చుట్టింది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలపై కేంద్ర బలగాలు ఆధిపత్యం సాధించాయి. ఈ క్రమంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఎన్‌కౌంటర్‌లు జరగడం, వేట ముమ్మరం కావడంతో ప్రాణాలు దక్కించుకునేందుకు మావోలు పక్కరాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. పోలీసులు కనిపెట్టేస్తారేమోనన్న భయంతో కూలీల అవతారమెత్తారు.

 

అలా కూలీలుగా మారిన నలుగురు మావోయిస్ట్‌లను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడి నుంచే భారీ విధ్వంసానికి కుట్రపన్నినట్లు ఛత్తీస్‌గడ్ పోలీసులకు తెలియడంతో వారు కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ సహకారంతో పట్టుకున్నారు. ఆ నలుగురిలో మోస్ట్ వాంటెడ్ కవాసీ భీమా తలపై రూ.లక్ష రివార్డు ఉంది. 2014 ఎన్నికల ముందు దేశంలో సంచలనం స‌ృష్టించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి మహేంద్రకర్మ, శుక్లాలతో పాటు మరో 43 మందిని మందుపాతర పేల్చి చంపిన ఘటనలో భీమా ప్రధానపాత్ర పోషించాడు. ఇతని కోసం మూడు రాష్ట్రాల పోలీసులు వేట ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మూడు నెలల కిందట ఆవుకు మండలం మెట్టుపల్లి గ్రామం చేరుకున్న భీమా..మాక్స్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపడుతున్న గాలేరు-నగరి టన్నెల్ పనుల్లో కూలీగా చేరాడు. తర్వాత తన గ్రామానికే చెందిన మావోయిస్ట్‌లు పోడియం లక్మాలక్మా, హిడ్‌మాకర్ణామి, కట్టాడు ఉంగాలను తన వద్దకు తెచ్చుకున్నాడు. ఈ వ్యవహారంతో ఇంకేంతమంది ఇలాంటి మార్గాల్లో రాష్ట్రం దాటివచ్చారో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. మొత్తానికి సేఫ్ జో‌న్ అనుకున్న దండకారణ్యంలో అన్నలకు సేఫ్టి లేకుండా పోయింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...