Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జైన్ ఫ్యాక్టరీ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం...చిత్తూరులో ఉద్రిక్తత
posted on: Jun 23, 2026 3:54PM

గిట్టుబాటు ధర లేక మామిడి రైతుల గగ్గోలు..
చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. జీడీ నెల్లూరు మండలం బొమ్మవారిపల్లెకు చెందిన లోకేష్ నాయుడు అనే రైతు, చిత్తూరు జిల్లా జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే అక్కడే ఉన్న తోటి రైతులు అప్రమత్తమై అతడిని అడ్డుకుని ప్రాణాపాయం నుంచి కాపాడారు.
నాలుగు రోజులుగా జైన్ ఫ్యాక్టరీ ఎదుట మామిడి లోడుతో పడిగాపులు కాస్తున్నా టోకెన్ నంబర్ కేటాయించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కళ్ల ముందే అధికార పార్టీ నేతల సిఫార్సులతో వచ్చిన ట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇస్తూ ఫ్యాక్టరీలోకి అనుమతిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
మామిడి పంటను విక్రయించుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షంలోనే ట్రాక్టర్లలో, చెట్ల కింద తలదాచుకుంటూ రోజులు గడుపుతున్నారు. కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో రైతుల ఆవేదన మరింత పెరిగింది. సిఫార్సుల పేరుతో జరుగుతున్న అక్రమాలను అరికట్టి, రైతులకు తగిన సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, గిట్టుబాటు ధర లేక ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారని అన్నారు. జిల్లాలో 25 పల్ప్ ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ రైతులు లారీలు, ట్రాక్టర్లలో రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని పేర్కొన్నారు.
ప్రభుత్వం కిలోకు రూ.4 మాత్రమే ఇస్తామని చేతులు దులుపుకుందని, ఫ్యాక్టరీలు రూ.6 ఇస్తామని చెప్పి చివరకు రూ.4 కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ ఏడాది సుమారు 7 లక్షల టన్నుల మామిడి పంటలో దాదాపు 2 లక్షల టన్నులు వృథా అయ్యే పరిస్థితి నెలకొందన్నారు.
మామిడి రైతులు కిలోకు కనీసం రూ.15 ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారని, ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రైతులు కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి దురదృష్టకరమని భూమన వ్యాఖ్యానించారు. గంగాధర నెల్లూరు ప్రాంతంలో రైతు ఆత్మహత్యాయత్నం ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, రైతుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
గిట్టుబాటు ధరలు, సబ్సిడీలు లేకపోవడంతో అనేక మంది రైతులు తమ మామిడి తోటలను నరికివేయడానికి సిద్ధమవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.






