పాపం... మంచిరెడ్డికి తప్పలేదు..



రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం టీడీపీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అనుకున్నంతపనీ చేస్తున్నాడు. టీడీపీకి గుడ్‌బై కొట్టేసి టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకోబోతున్నారు.  టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయోగించిన ‘ఆకర్ష’ అస్త్రం విజయవంతంగా పనిచేసి మరో లక్ష్యాన్ని ఛేదించింది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరడాన్ని తెలంగాణ టీడీపీ లైట్‌గా తీసుకున్నట్టుగా స్టేట్‌మెంట్ ఇచ్చింది. పార్టీ నుంచి ఎవరు వెళ్ళిపోయినా టీటీడీపీ నాయకులు ఒకరిద్దరు వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీకేమీ ఢోకాలేదు అనే స్టేట్‌మెంట్ టీడీపీ నుంచి  వస్తూ వుంటుంది. అయితే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పార్టీ మారిపోవడం అనేది టీటీడీపిని మరింత కలవరపెట్టే అంశమే. అయినప్పటికీ ఆ కలవరపాటును బయటకి కనిపించనీయకుండా టీటీడీపీ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. తెలంగాణ టీడీపీ దృష్టిలో, రాజకీయాలను గమనించేవారి దృష్టిలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చేసింది తప్పుగా అనిపించవచ్చు. అయితే ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తే మాత్రం.. మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేసింది తప్పు కాదని... తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన పార్టీ మారాల్సి వచ్చిందనే విషయం ఆయన తెలుగుదేశం పార్టీలో ఎదుర్కొన్న పరిస్థితులు, నియోజకవర్గంలోని పరిస్థితులను చూసిన వారికి అర్థమవుతుంది.


మంచిరెడ్డి తెలుగుదేశం పార్టీలో ఇప్పటివాడేమీ కాదు... 30 సంవత్సరాలుగా పార్టీలో వున్నవాడు. పార్టీకి ఎంతో సేవ చేసినవాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా టీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఎదుర్కొని నిలబడి విజయాన్ని సాధించినవాడు. తెలంగాణలో అధికారం ఎలాగూ రాలేదు.. పార్టీలో అయినా గౌరవనీయమైన పదవి వస్తుందేమోనని ఆశించాడు. అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి అడిగాడు. లేదన్నారు. విప్ పదవి అడిగాడు. లేదన్నారు. పోనీ టీటీడీ బోర్డు సభ్యుడి పదవైనా ఇవ్వండి మహప్రభో అని అడిగాడు.. కుదరదని చెప్పేశారు. దాంతో ఆయన ఒక విధమైన నైరాశ్యంలోకి వెళ్ళిపోయాడు. దీనికితోడు టీఆర్ఎస్ పకడ్బందీగా ప్రయోగించిన ‘ఆకర్ష’ పథకం కూడా ఆయన మీద బాగా ప్రభావం చూపించింది.

ఇబ్రహీంపట్నం నియోజవర్గంలో టీఆర్ఎస్ ఇప్పటికే బాగా చొచ్చుకుపోయింది. తెలుగుదేశం పార్టీ నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సర్పంచుల లాంటి స్థానిక నాయకులు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు. ఆయన నియోజకవర్గంలో టీడీపీ ఇప్పటికే దాదాపుగా ఖాళీ అయిపోయింది. పాపం మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఒక్కడే ఒంటికాయ శొంఠికొమ్ములా మిగిలిపోయాడు.  ఆయన మాట వినేవాళ్ళుగానీ, వెంట నడిచేవారుగానీ లేకుండా పోయారు. అధికారులు కూడా మంచిరెడ్డి చెప్పిన పనులు చేసే పరిస్థితులు లేకుండా పోయాయి. ఇక నిధుల సంగతికి వస్తే సరేసరి. ఇలా ‘ఆకర్ష’ పథకానికి ఆద్యుడైన వైఎస్సార్ కంటే మరింత పర్‌ఫెక్ట్‌గా టీఆర్ఎస్ ‘ఆకర్ష’ పథకాన్ని ప్రయోగించడంతో ఇక మంచిరెడ్డికి పార్టీ మారక తప్పని పరిస్థితులు వచ్చేశాయి. కార్యకర్తలే వెంట లేకుండా వుంటే నాయకుడు ఎమ్మెల్యే అయినా ఉపయోగం లేదు... సీఎం అయినా ఉపయోగం వుండదు. ఈ ఒత్తిడిని భరించలేక మంచిరెడ్డి టీఆర్ఎస్‌లోకి జంప్ కాక తప్పలేదు.  ఇదిలా వుంటే, ఇలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొంటున్న మరో ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా త్వరలో టీఆర్ఎస్‌లోకి వెళ్ళే అవకాశం వుందని ప్రచారం జరుగుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu