అధికారముంటే ఏమైనా చేస్తారా..?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కోల్‌కతా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దుర్గామాత విగ్రహాల నిమజ్జనంపై మమత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను కోల్‌కతా హైకోర్టు రద్దు చేసింది. అసలు ఇంతటి వివాదానికి కారణం ఏంటంటే..శరన్నవరాత్రులు ముగిసిన తర్వాత అప్పటి వరకు పూజించిన దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సారి నిమజ్జనోత్సవం జరిగే రోజు మొహర్రం వచ్చింది. అదే రోజు ముస్లిం సోదరులు కూడా తాజియా ఊరేగింపు జరుపుతారు..

 

రెండు ఊరేగింపులు ఒకేసారి వస్తే శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయనే భావనతో మమత ప్రభుత్వం దుర్గామాత విగ్రహాలను మొహర్రం రోజున నిమజ్జనం చేయరాదంటూ ఆదేశించింది. ఆ ఆదేశాలను సవాలు చేస్తూ కోల్‌కతా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసింది. అధికారం చేతుల్లో ఉంది కాదా అని నిరంకుశ ఆదేశాలు జారీ చేయవచ్చునా..? అని ప్రశ్నించింది.  మొహర్రం ఊరేగింపుకు, దుర్గామాత విగ్రహాల నిమజ్జనాలకు వేర్వేరు మార్గాలను నిర్ణయించాలని ఆదేశించింది. ముంబై పోలీసులను చూసి నేర్చుకోవాలని సూచించింది.