Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణకు రెండు కొత్త ఎయిర్‌పోర్టులు..!
posted on: Jul 14, 2026 3:13PM

తెలంగాణ విమానయాన రంగంలో సరికొత్త అధ్యాయం లిఖించబడబోతోంది. ఓరుగల్లు వాసుల దశాబ్దాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. వరంగల్‌లోని చారిత్రాత్మక మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో జరిపిన కీలక భేటీలో ఈ ప్రాజెక్టుపై అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.
మూడు నుంచి నాలుగు వారాల్లోనే ఈ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుండడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2, 2028 నాటికి ఈ ప్రతిష్టాత్మక విమానాశ్రయాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టమైన గడువును నిర్దేశించుకున్నారు.
ఈ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఇప్పటికే రికార్డు స్థాయిలో 253 ఎకరాల భూమిని కేటాయించింది. భూసేకరణ ప్రక్రియను ఇంత వేగంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేయడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. విమానాశ్రయాల నిర్మాణంలో భూసేకరణ అనేది ఒక పెద్ద సవాల్‌గా మారుతున్న తరుణంలో, వరంగల్ ఎయిర్‌పోర్ట్ భూసేకరణ ఒక చరిత్రలా సాగిందని ఆయన కొనియాడారు.
ఈ విమానాశ్రయ పునర్నిర్మాణ ప్రాజెక్టును ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సుమారు 850 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనుంది. కాకతీయుల వైభవం, వారి శిల్పకళా వారసత్వం ఉట్టిపడేలా ఈ విమానాశ్రయ టెర్మినల్ బిల్డింగ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
మామునూరు విమానాశ్రయంలో రన్‌వేను ప్రస్తుతమున్న 1860 మీటర్ల నుంచి 2500 మీటర్ల పొడవుకు విస్తరించనున్నారు. దీనివల్ల ఎయిర్‌బస్ ఏ320 వంటి పెద్ద వాణిజ్య విమానాలు కూడా ఇక్కడ సులభంగా ల్యాండ్ అయ్యే అవకాశం కలుగుతుంది. దీనితో పాటు, 6800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక డొమెస్టిక్ ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్‌ను నిర్మిస్తారు.
ఇది పీక్ అవర్స్‌లో ఒకేసారి 850 మంది ప్రయాణికులకు (425 మంది వచ్చే వారు, 425 మంది వెళ్లే వారు) సేవలందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే, ఏకకాలంలో మూడు కోడ్-సి విమానాలను పార్క్ చేసేలా అత్యాధునిక ఏప్రాన్, ఐసోలేషన్ బే, మరియు కేటగిరీ-3 ఏటీసీ టవర్ కమ్ టెక్నికల్ బ్లాక్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. వరంగల్ చుట్టుపక్కల పరిశ్రమలు, ముఖ్యంగా టెక్స్‌టైల్ పార్క్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇక్కడ కార్గో సర్వీసులు మరియు ఎంఆర్ఓ (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్) సదుపాయాలను కూడా కల్పించనున్నారు.
ఈ విమానాశ్రయం కేవలం వరంగల్ వాసులకే కాకుండా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాల ప్రజల రవాణా అవసరాలను తీర్చనుంది. అలాగే ఏటా ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు సైతం ఈ విమాన సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. మామునూరుతో పాటు ఉత్తర తెలంగాణ సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ఆదిలాబాద్ విమానాశ్రయ అభివృద్ధికి సైతం కేంద్రం పూర్తి సహకారం ప్రకటించింది.
ఆదిలాబాద్‌లో డిఫెన్స్ (రక్షణ శాఖ) అవసరాలతో పాటు పౌర విమానయాన సేవల కోసం ఏకంగా 1500 ఎకరాల భూసేకరణ జరుపుతున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా మరో 100 కొత్త విమానాశ్రయాలను నిర్మించే లక్ష్యంలో భాగంగా తెలంగాణకు ఈ రెండు భారీ ప్రాజెక్టులు దక్కడం రాష్ట్ర పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధికి ఊతమివ్వనుంది. ప్రస్తుతం దేశ జీడీపీలో 5 శాతం వాటాను అందిస్తున్న తెలంగాణ, ఈ కొత్త ఎయిర్‌పోర్టుల రాకతో వికసిత్ భారత్ లక్ష్యంలో మరింత కీలక భాగస్వామిగా మారబోతోంది.






