ఉనికి కోసం దీదీ పోరాటం!

posted on: Jun 4, 2026 5:41PM

పశ్చిమ బెంగాల్‌లో పదిహేనేళ్లు అధికారంలో ఉన్న మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ఉనికి అధికారం కోల్పోగానే ప్రశ్నార్థకంగా మారింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీఎంసీకి అసెంబ్లీలో 80 ఎమ్మెల్యేలు ఉంటే.. రుతువ్రత బెనర్జీ నేతృత్వంలో 58 మంది ఎమ్మెల్యేలు తిరుగు  బావుటా ఎగరేశారు. అసెంబ్లీలో తామే అసలైన టీఎంసీ అని రుతువ్రత స్పష్టం చేయడంతో ఆయనకు ప్రతిపక్ష నేత హోదా దక్కింది. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో టీఎంసీ ఎమ్మెల్యేలు ఇచ్చిన షాక్ నుంచి కోలుకోక ముందే మమతాబెనర్జీకి పార్లమెంట్‌లో సేమ్ సీన్ రిపీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. టీఎంసీకి లోక్‌సభలో 25 మంది, రాజ్యసభలో 13 మంది ఎంపీలున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన సుమారు 20 మంది ఎంపీలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇప్పటికే ఈ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. 

పార్లమెంటులో ఎంపీల సంఖ్యాపరంగా టీఎంసీ రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉంది. ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో కనిపించిన సీన్ రాబోయే కొన్ని రోజుల్లో పార్లమెంటులో కూడా కనిపిస్తుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. టీఎంసీ రెబల్ వర్గం బలం మరింత పెరుగుతుందని అంటున్నారు.  దాంతో ప్రస్తుతం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తమ పార్టీ ఎన్నికల గుర్తు, పార్టీ పేరును కాపాడుకునే పనిలో నిమగ్నమవ్వాల్సి వచ్చింది.  పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో టీఎంసీ ఒక దశలో ప్రజా ఉద్యమాలకు ప్రతీకగా నిలిచింది. వామపక్షాల 34 ఏళ్ల పాలనను సింగూర్, నందిగ్రామ్ వంటి భూసేకరణ వ్యతిరేక ఉద్యమాల ద్వారా సవాలు చేసి, మమతా బెనర్జీ 2011లో అధికారంలోకి వచ్చారు.

కానీ కాలక్రమేణా, టీఎంసీ కుటుంబ పాలనకు పరిమితమైందన్న విమర్శలు పెరిగాయి. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కీలక వ్యూహకర్తగా ఎదగడం, టీఎంసీలో మమత, అభిషేక్‌ల ఏకఛత్రాధిప్యతం పెరగడంతో.. పార్టీ అధికారం కోల్పోగానే అసంతృప్తి జ్వాలలు ఒక్కసారి భగ్గుమంటున్నాయి. ఆ క్రమంలో  సీనియర్ ఎమ్మెల్యే శోభన్దేబ్ చటోపాధ్యాయని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా  నామినేట్ చేస్తూ టీఎంసీ మొదటి లేఖను అసెంబ్లీ సచివాలయానికి సమర్పించింది.

అయితే, టీఎంసీ శాసనసభ పక్షం ద్వారా కాకుండా పార్టీపరంగా లేఖ పంపడంతో  అసెంబ్లీ సచివాలయం దాన్ని తిరస్కరించింది. తర్వాత  టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాలతో రెండవ లేఖ సమర్పించారు. ఈ లేఖలో 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో సుమారు 70 మంది సంతకాలు చేసినట్లు రికార్డుల్లో ఉంది. కాని అసెంబ్లీ రికార్డులతో పోల్చినప్పుడు, కొన్ని సంతకాలు సరిపోలేదు.  ముఖ్యంగా, కనింగ్ ఈస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే బహరుల్ ఇస్లాం లేఖపై సంతకం చేయలేదని బహిరంగంగా ప్రకటించడం, నకిలీ సంతకాల ఆరోపణలకు బలాన్ని చేకూర్చింది.

దాంతో అసెంబ్లీ సచివాలయం  కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో,  కేసు దర్యాప్తు బాధ్యత పశ్చిమ బెంగాల్ సీఐడీకి అప్పగించారు. ఆ దర్యాప్తు ప్రొసెస్‌లో ఉంది. ఇలా నకిలీ సంతకాల కేసు, సీఐడీ సమన్లు, అంతర్గత తిరుగుబాటులతో మూడు సార్లుగా సీఎంగా పనిచేసిన బెంగాల్ దీదీ ఉనికి కోసం పోరాడాల్సిన దుస్థితి ఏర్పడింది.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.     

google-ad-img
    Related Sigment News
    • Loading...