Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మా, మాటీ, మనుష్ నుంచి మేమే అసలైన టీఎంసీ వరకూ.. ఒక మమతా బెనర్జీ!
posted on: Jun 5, 2026 4:22PM

టీఎంసీ చీలిక, తిరుగుబాటు.. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లోనూ మహారాష్ట్ర నమూనా? పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు.. కేవలం ఒక పార్టీ అంతర్గత సంక్షోభం మాత్రమే కావు. అవి మమతా బెనర్జీ రాజకీయ వారసత్వానికే సవాలు విసురుతున్న చారిత్రకంగా ఎదురవుతోన్న మలుపులు.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో.. బీజేపీ చేతిలో ఘోర పరాజయం, ఆ వెంటనే టీఎంసీ శాసనసభ పక్షంలో తిరుగుబాటు, మేమే అసలైన టీఎంసీ అంటూ రీటాబ్రత బెనర్జీ వర్గం ముందుకు రావడం, స్పీకర్ రతీంద్ర బోస్ ఆ వర్గానికి శాసనసభ పక్ష హోదా కల్పించడం.. వీటన్నిటినీ కలిపి చూస్తే, మా, మాటీ, మనుష్ నినాదంతో ఎదిగిన.. మమతా బెనర్జీ ఇప్పుడు తన సొంత పార్టీ నుంచే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. టీఎంసీ ఎదుగుదల ఒకసారి పరిశీలిస్తే.. 1998లో మమతా బెనర్జీ, కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తితో తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. వామపక్షాల 34 ఏళ్ల పాలనకు ప్రత్యామ్నాయంగా టీఎంసీ క్రమంగా ఎదిగింది. సింగూర్, నందిగ్రామ్ ఉద్యమాలు కీలకంగా పని చేశాయి. భూసేకరణ వ్యతిరేక ఉద్యమాల ద్వారా మమతా బెనర్జీ పేదల, రైతుల, మహిళల స్వరంగా నిలిచారు. 2011లో వామపక్షాలను గద్దెదించి చరిత్ర సృష్టించారు.
మా, మాటీ, మనుష్ నినాదంతో పాటు.. మమతా బెనర్జీ వ్యక్తిత్వం, వీధి పోరాట శైలి, సంక్షేమ పథకాల మిశ్రమం.. టీఎంసీకి ప్రత్యేక రాజకీయ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చి పెట్టాయి. అదే సమయంలో అభిషేక్ బెనర్జీ ఎదుగుదల, కుటుంబ రాజకీయ ఆరోపణలనూ తీసుకొచ్చి పెట్టాయి. గత దశాబ్దంలో టీఎంసీ సంస్థాగత నిర్మాణం క్రమంగా మమతా, అభిషేక్ అనే రెండు పవర్ సెంటర్ల వైపు మళ్లింది. పార్టీ, ప్రభుత్వం, ఎన్నికల వ్యూహం.. అన్నింటిలోనూ అభిషేక్ బెనర్జీ కీలకంగా మారడంతో.. ఒకే నాయకత్వం- ఒకే వారసత్వం అనే మోడల్‌పై అంతర్గత అసంతృప్తి చెలరేగింది. తిరుగుబాటు వర్గం విమర్శలు నేరుగా మమతపై కాకుండా.. ప్రధానంగా అభిషేక్‌పై కేంద్రీకృతమవడానికి కారణమిదే.
15 ఏళ్ల పాలన తర్వాత.. టీఎంసీ, బీజేపీ చేతిలో చిత్తుగా ఓడిపోవడం.. పార్టీ మానసిక స్థితిని ఒక్కసారిగా మార్చేసింది. విమర్శల వర్షం మొదలైంది. అభిషేక్ బెనర్జీ ఆధ్వర్యంలోని ఎన్నికల వ్యూహం, అభ్యర్థుల ఎంపిక, ముస్లిం ఓటు బ్యాంక్‌పై అతిగా ఆధారపడటం.. వంటి అంశాలపై అంతర్గతంగా అసంతృప్తి పెరిగింది. ఇక ఎమ్మెల్యేల సమావేశం ఎలాంటిదంటే, కొత్తగా ఎన్నికైన 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేల కోసం మమతా బెనర్జీ పిలిచిన సమావేశానికి కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారనే వార్తలు వెలువడటం.. టీఎంసీ అగ్ర నాయకత్వంపై ఎంతటి అసంతృప్తి ఉందో తెలియ చేసింది.
ఆ సమావేశంలోనే శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, డిప్యూటీ లీడర్లు, చీఫ్ విప్ పేర్లను నిర్ణయించే అధికారం పార్టీ నాయకత్వానికి అప్పగించారని అధికార వర్గం వాదన. రీటాబ్రత బెనర్జీ, సందీపన్ సహా ఇతరులు.. తమ సంతకాలతో సహా పలువురు ఎమ్మెల్యేల సంతకాలు నకిలీవని ఫిర్యాదు చేశారు. దీన్ని ఆధారంగా చేసుకుని.. పార్టీ వారిని వ్యతిరేక కార్యకలాపాల పేరిట బహిష్కరించింది. సస్పెండ్ అయిన టీఎంసీ నాయకుడు రిజు దత్తా, దాదాపు 50 మంది ఎమ్మెల్యేలతో- ఒక హోటల్‌లో సమావేశమై మహారాష్ట్ర నమూనా అమలు చేద్దామనీ, మూడింట రెండు వంతుల మెజారిటీ తమవద్ద ఉందని ప్రకటించారు. మేమే అసలైన టీఎంసీ నినాదం చేశారు. తిరుగుబాటు వర్గం, తామే అసలైన టీఎంసీ, పార్టీ గుర్తు కూడా తమకే రావాలని బహిరంగంగా ప్రకటించడం, సంక్షోభాన్ని కొత్త రూట్లోకి తీసుకెళ్లింది.
రీటాబ్రత బెనర్జీ వర్గం, 58, 59 మంది టీఎంసీ ఎమ్మెల్యేల మద్దతు లేఖతో.. స్పీకర్ రతీంద్ర బోస్‌ను కలిసింది. ఇది 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ. స్పీకర్, రీటాబ్రత బెనర్జీని అధికారికంగా ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించి, కొత్త శాసనసభ పక్ష నిర్మాణాన్ని అంగీకరించారు. టీఎంసీ అధికార వర్గ ప్రతిస్పందన ఎలా ఉందో చూస్తే.. మమతా వర్గం, ఈ చర్యను న్యాయపరంగా సవాలు చేయడానికి సిద్ధమవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.
తిరుగుబాటు తీవ్రత పెరుగుతున్న సమయంలో.. టీఎంసీ కేంద్ర నాయకత్వం, పశ్చిమ బెంగాల్‌లోని అన్ని కమిటీలు, అనుబంధ సంస్థలను రద్దు చేస్తూ.. ప్రతి స్థాయిలో ఆత్మపరిశీలన, పనితీరు సమీక్ష, సంస్థాగత మదింపు చేపడతామని ప్రకటించింది. ఇది నిలువు చీలికను నివారించడానికి చివరి ప్రయత్నంలా కనిపిస్తున్నప్పటికీ.. తిరుగుబాటు వర్గం ఇప్పటికే శాసనసభ పక్షాన్ని తమ అధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో, ఈ చర్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు కనిపిస్తోంది.
15 ఏళ్ల పాలన తర్వాత బీజేపీ చేతిలో ఘోర పరాజయం టీఎంసీ అంతర్గత అసంతృప్తికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. లోప భూయిష్టమైన నియామకంపై నకిలీ సంతకాల ఆరోపణ.. తిరుగుబాటుకు న్యాయ పూర్వకమైన నైతిక ఆధారంగా కనిపిస్తోంది. మూడింట రెండు వంతుల మెజారిటీ అంటే, 58నుంచి 59 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖతో రీటాబ్రత వర్గం.. యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని దాటే సంఖ్యగా తెలుస్తోంది. రీటాబ్రత బెనర్జీని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించిన స్పీకర్ నిర్ణయం.. మమతా వర్గానికి పెద్ద దెబ్బ అనడంలో సందేహం లేదు. తిరుగుబాటు వర్గం మమతాను గైడింగ్ ఫోర్స్ గా కోరుతూ, అభిషేక్‌ను లక్ష్యంగా చేసుకోవడం.. కుటుంబ వారసత్వ రాజకీయంపై స్పష్టమైన తిరుగుబాటుగా కనిపిస్తోంది. టీఎంసీకి 80 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో, మూడింట రెండు వంతుల మెజారిటీకి 54 మంది అవసరం. తిరుగుబాటు వర్గం 58 నుంచి 59 మంది మద్దతు ఉందని చూపించడం, యాంటీ డిఫెక్షన్ చట్టం కింద స్ప్లిట్ కాకుండా మెర్జర్/లెజిటిమేట్ గ్రూప్ గా తమను తాము చూపించుకునే ప్రయత్నంగా తెలుస్తోంది. శాసనసభ పక్షంలో మెజారిటీ తమ దగ్గర ఉందని రీటాబ్రత వర్గం వాదిస్తోంది. కానీ పార్టీ గుర్తు, ఎన్నికల చిహ్నం, సంస్థాగత నిర్మాణం విషయంలో.. తుది నిర్ణయం ఎన్నికల సంఘం, కోర్టుల పరిధిలోకి వెళ్లే అవకాశం ఉంది.
స్పీకర్ రతీంద్ర బోస్, రీటాబ్రత వర్గాన్ని శాసనసభలో అసలైన టీఎంసీగా గుర్తించి, హోదా ఇవ్వడం ద్వారా, శాసనసభలో అధికారిక ప్రతిపక్ష నిర్మాణాన్ని మార్చేశారు. మమతా వర్గం, సంతకాల నిజస్వరూపం, సమావేశాల చట్టబద్ధత, పార్టీ అంతర్గత నిర్ణయ ప్రక్రియల ఆధారంగా.. ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది.
మేమే అసలైన టీఎంసీ, పార్టీ గుర్తు మాకే ఇవ్వాలి అనే రిజు దత్తా, తిరుగుబాటు వర్గం డిమాండ్, చివరికి ఎన్నికల సంఘం ముందుకు వెళ్లే అవకాశం ఉన్న వివాదాస్పదాంశంగా మారింది. శివసేనలో ఉద్ధవ్ ఠాక్రే- ఎకనాథ్ షిండే మధ్య జరిగిన గుర్తు, పార్టీ పేరుపై పోరాటం మాదిరిగానే, టీఎంసీ కూడా అసలైన పార్టీ ఏది? అనే ప్రశ్నను ఎదుర్కొనే దిశగా సాగుతోంది.
ఇది మమతా బెనర్జీ నాయకత్వ సంక్షోభమా, లేక అభిషేక్ వ్యతిరేక తిరుగుబాటా? అని చూస్తే.. తిరుగుబాటు వర్గం, మమతాను నేరుగా లక్ష్యంగా చేసుకోవడాన్ని జాగ్రత్తగా తప్పించుకుంటూ, ఆమెను చీఫ్ అడ్వైజర్ గా ఉండాలని కోరుతూ, అభిషేక్ బెనర్జీపై విమర్శల్ని కేంద్రీకరిస్తోంది. ఇది రెండు విషయాలను సూచిస్తుంది. మమతా వ్యక్తిగత ఇమేజ్‌కు ఇంకా బలం ఉందనీ, ఆమెను పూర్తిగా తిరస్కరించే స్థాయికి తిరుగుబాటు వర్గం వెళ్లలేదనీ, ఆమె ప్రజాదరణను వారు కూడా అంగీకరిస్తున్నారని అర్థం అర్ధమౌతోంది. పార్టీని కుటుంబ వారసత్వ ప్రాజెక్టుగా మార్చడంపైనే ఈ అసంతృప్తి. మా, మాటీ, మనుష్ నినాదం నుంచి మా కుటుంబం, మా వారసత్వం వైపు సాగుతోన్న ఈ మార్పుపై అంతర్గత ప్రతిఘటనగా దీనిని చూడవచ్చు. టీఎంసీ బలహీనపడటం బీజేపీకి తాత్కాలికంగా లాభం అయినప్పటికీ, శాసనసభలో బలమైన, క్రమబద్ధమైన ప్రతిపక్షం లేకపోవడం, రాజకీయ సమీకరణాలను క్లిష్టతరం చేస్తుంది.
ఇప్పటికే బలహీనమైన వామపక్షాలు, కాంగ్రెస్ శక్తులు, టీఎంసీ చీలికను తమ పునరుద్ధరణకు అవకాశంగా మలుచుకోగలరా? అన్నదింకా స్పష్టంగా లేదు. జాతీయ, ప్రాంతీయ మీడియాలు.. ఈ సంక్షోభాన్ని అసలి టీఎంసీ వర్సెస్ మమతా టీఎంసీ గా ఫ్రేమ్ చేస్తోంది. రీటాబ్రత బెనర్జీని రెబెల్ గా చిత్రీకరిస్తోంది. శాసనసభ పక్షంలోని పెద్ద భాగం తిరుగుబాటు వర్గం వైపు వెళ్లడం, మమతా బెనర్జీకి సంస్థాగతంగా పెద్ద దెబ్బ. వీధి రాజకీయాలకే పరిమితమా? టీఎంసీ శాసనసభ పక్షం, పార్టీ నిర్మాణం రెండూ చేతులమధ్య నుంచి జారిపోతే, మమతా మళ్లీ వీధి పోరాట నాయకురాలిగా మారే పరిస్థితి రావచ్చన్న అంచనాలున్నాయి.
శివసేన, టీఎంసీ సారూప్యతలు ఎలాంటివో పరిశీలిస్తే.. కుటుంబ వారసత్వం, రెండో తరం నాయకత్వంపై గల అసంతృప్తి, శాసనసభ పక్షంలో మూడింట రెండు వంతుల మెజారిటీతో తిరుగుబాటు, అసలైన పార్టీ హక్కుపై పోరాటం.. ఇవన్నీ మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి. ఇక మమతా బెనర్జీ వ్యక్తిగత కరిష్మా, వీధి పోరాట చరిత్ర, బలమైన మైనారిటీ, గ్రామీణ ఓటు బ్యాంక్.. ఇవి ఆమెను పూర్తిగా తీసిపడేయటం.. అంత సులభం కాదనే వాదనకు బలం చేకూర్చుతున్నాయి.
టీఎంసీ అంతర్గత పోరాటం మధ్య, కొందరు నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగినట్లు వచ్చిన వార్తలు, బెంగాల్ లొ రాజకీయ హింస ఆందోళన కలిగిస్తున్నాయి. పాలన, అభివృద్ధి కన్నా.. పార్టీ అంతర్గత కుమ్ములాటలపై నాయకత్వం ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం, నిరుద్యోగం, పరిశ్రమల కొరత, చట్ట వ్యవస్థ సమస్యలపై చర్చ పక్కకు వెళ్లడం.. ఇవి ప్రజల్లో విసుగును పెంచే ప్రమాదం ఉంది.
మా, మాటీ, మనుష్ నుంచి మేమే అసలైన టీఎంసీ వరకు సాగిన ఈ టీఎంసీ పొలిటికల్ జర్నీలో.. కేవలం ఎన్నికల ఓటమి తర్వాత వచ్చిన తాత్కాలిక కలకలం కాదు. ఇది మూడు స్థాయిల్లో స్పష్టమైన సంకేతంగా తెలుస్తోంది. అందులో మొదటిది.. కుటుంబ రాజకీయాలతో పార్టీ నిర్మాణం, ఒక దశ తర్వాత అంతర్గత ప్రజాస్వామ్యాన్ని తొక్కిపెడితే, అది తిరుగుబాటుకు దారితీస్తుందనేందుకిదో ఉదాహరణ.
బలమైన కేడర్, సిద్ధాంతపరమైన స్పష్టత, అంతర్గత చర్చా వేదికలు.. లేకపోతే, పార్టీలు ఎన్నికల యంత్రాలుగా మారి, ఓటమి వచ్చిన వెంటనే చీలిపోతాయి. న్యాయ, రాజకీయ సమీకరణాల కొత్త యుగం సంగతికి వస్తే.. మహారాష్ట్ర నమూనా ఇప్పుడు బెంగాల్‌లోనూ అమలవుతోందని, ఇది భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లోనూ పునరావృతమయ్యే ప్రమాదం ఉందని ఈ సంఘటనలు సూచిస్తున్నాయి. మమతా బెనర్జీకి ఇది అత్యంత క్లిష్టమైన దశ. ఆమెను తిరుగుబాటు వర్గం మార్గదర్శిగా గౌరవిస్తున్నామని చెప్పినా, శాసనసభ పక్షం, పార్టీ నిర్మాణం, ఎన్నికల చిహ్నం.. ఈ మూడు ముఖ్యమైన అంశాలపై.. ఆమె నియంత్రణ ప్రశ్నార్థకమవుతోంది. ఒకప్పుడు మా, మాటీ, మనుష్ నినాదం ఇచ్చిన నాయకురాలు, ఇప్పుడు మేమే అసలైన టీఎంసీ అని నమ్మించాల్సిన దుస్థితికి చేరడం విచారకరంగా మారింది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






