20 మంది టీఎంసీ ఎంపీల తిరుగుబాటు షాక్ టీఎమ్ సీపై మమత పట్టు జారిపోయిందా?

posted on: Jun 9, 2026 10:27AM

 

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్   పార్టీ (టీఎమ్సీ) ప్రస్తుతం పీకల్లోతు  సంక్షోభంలో కూరుకుపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం ఆ పార్టీ పునాదులను కదిలించేసింది. బెంగాల్ అసెంబ్లీలో గెలిచిన మొత్తం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో ఏకంగా 58 మందికి పైగా తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే.

ఆ షాక్ నుంచి మమత తేరుకోకముందే..  టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది.  ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే   కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో  ఇండియా' కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు   తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాలు చూస్తుంటే టీఎమ్సీపై మమతా బెనర్జీ పూర్తిగా పట్టు కోల్పోయారని అనిపిస్తోంది.  

 గడిచిన 13 సంవత్సరాలుగా రాజ్యసభలో టీఎంసీ చీఫ్ విప్‌గా సేవలందించిన సీనియర్ నాయకుడు సుఖేందు శేఖర్ రాయ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే మరో ఐదుగురు లోక్‌సభ ఎంపీలతో అత్యవసరంగా సమావేశం కావడం  కలకలం రేపింది. ఆ తర్వాత బెంగాల్ మాజీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆధ్వర్యంలో సుమారు 20 మంది టీఎంసీ లోక్‌సభ సభ్యులు కేంద్ర మంత్రి, బెంగాల్ ఎన్నికల వ్యూహకర్త భూపేందర్ యాదవ్ నివాసంలో భేటీ అయ్యారు.

ఈ తిరుగుబాటు ఎంపీల బృందానికి సీనియర్ నాయకురాలు కాకొలి ఘోష్ దస్తీదార్ నాయకత్వం వహిస్తున్నారు. మమతా బెనర్జీకి అత్యంత ఆప్తురాలిగా పేరున్న దస్తీదార్..  ఇటీవల తనను  లోక్‌సభ చీఫ్ విప్ పదవి నుంచి తనను తప్పించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమతో పాటు ఉన్న 20 మంది ఎంపీల సంతకాలతో ఎన్డీయే కూటమిలో చేరతామంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అధికారికంగా లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె ప్రకటించారు.

ప్రజాప్రతినిధులు ఇలా బహిరంగంగా తిరుగుబాటు చేస్తుంటే..  క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల నేతలకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అవినీతికి పాల్పడ్డారంటూ ఒక టీఎంసీ కౌన్సిలర్‌కు గుండు కొట్టించి, చెప్పుల దండ వేసి వీధుల్లో ఊరేగించిన ఘోర ఉదంతం బెంగాల్‌లోని ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతోంది.

మరోవైపు మమతా బెనర్జీ కుటుంబ రాజకీయాల చుట్టూ కూడా వివాదాలు ముసురుకున్నాయి. తిరుగుబాటు ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని పక్కన పెట్టి కలిసి పనిచేద్దామని  మమతా బెనర్జీకి ప్రతిపాదించగా, ఆమె తిరస్కరించినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.  

అయినప్పటికీ అభిషేక్ బెనర్జీ ప్రాభవాన్ని తగ్గించడానికి మమత అదనంగా ఇద్దరు జాతీయ ప్రధాన కార్యదర్శులను నియమించారు. ఇటీవలే సోనార్‌పూర్‌లో పర్యటించిన అభిషేక్ బెనర్జీపై స్థానికులు రాళ్లు, గుడ్లు, చెప్పులతో దాడి చేశారు. రక్షణ కోసం ఆయన క్రికెట్ హెల్మెట్ ధరించాల్సిన పరిస్థితి వచ్చింది. నామినేషన్ పత్రాల్లో ఫోర్జరీ సంతకాల వివాదంలో అభిషేక్ బెనర్జీకి సీఐడీ  సమన్లు కూడా జారీ చేసింది.   15 ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన తృణమూల్ కాంగ్రెస్, తన రాజకీయ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన మనుగడ పోరాటాన్ని ఎదుర్కొంటోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...