మమతా బెనర్జీ మేనల్లుడి భద్రత తొలగింపు

posted on: May 12, 2026 9:15AM

తృణమూల్ కాంగ్రెస్ కు సువేందు అధికారి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమత బెనర్జీ మేనల్లుడికి భద్రత ఉపసంహరించుకుంది.  తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత,  డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఇప్పటివరకు ఉన్న  జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పశ్చిమ బెంగాల్ లో కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం పూర్తిగా తొలగించింది.  ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  తృణమూల్ కాంగ్రెస్ పరాజయం పాలై.. సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే.  సువేందు అధికారి సీఎంగా పగ్గాలు చేపట్టగానే మాజీ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మేనల్లుడు, టీఎంసీ కీలక నేత అభిషేక్ బెనర్జీకి జడ్ ప్లస్ కేటగరీ భద్రతను ఉపసంహరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 

అభిషేక్ బెనర్జీ గత దశాబ్దంగా అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో  ఉంటూ వచ్చారు. అయితే సోమవారం సాయంత్రం జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ప్రకారం, ఆయనకు కేటాయించిన అదనపు సెక్యూరిటీ సిబ్బందిని, ప్రత్యేక పైలట్ వాహనాలను ఉపసంహరించారు.   ఇకపై ఆయనకు  ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడికి ఉండే భద్రత మాత్రమే ఉంటుంది. 

ముఖ్యమంత్రి సువేందు అధికారి సచివాలయం నబన్న లో జిల్లా మెజిస్ట్రేట్లు మరియు సీనియర్ పోలీసు అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. భద్రత అనేది కేవలం ప్రాణహాని ఉన్నవారికి మాత్రమే ఉండాలని.. అది స్టేటస్ సింబల్ గా మార్చకూడదని ముఖ్యమంత్రి సువేందు అధికారి పేర్కొన్నారు.   ప్రజా ధనాన్ని అనవసర భద్రతా ఏర్పాట్ల కోసం ఖర్చు చేయడం సరికాదన్నారు. 

కోల్‌కతాలోని అభిషేక్ బెనర్జీ నివాసం ద్ద ఉన్న భారీ పోలీస్ బారికేడ్లను, కియోస్క్‌లను పోలీసులు తొలగించారు. అలాగే కామాక్ స్ట్రీట్‌లోని ఆయన కార్యాలయం వద్ద ఉన్న నిఘా పరికరాలను, అదనపు బలగాలను కూడా వెనక్కి పిలిపించారు.  

గతంలో 2015లో ఒక బహిరంగ సభలో అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి తర్వాత ఆయనకు భద్రతను జెడ్ ప్లస్ కేటగిరీకి పెంచారు. సుమారు 55 మంది భద్రతా సిబ్బంది, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఆయన రక్షణ కోసం ఉండేవారు. ఇప్పుడు అధికార మార్పిడి నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ నాయకుల భద్రతపై ప్రభుత్వం పునఃసమీక్ష నిర్వహిస్తోంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...