మల్లాది విష్ణు త్వరలో వైకాపాలోకి జంప్

 

ప్రత్యేక హోదా అంశం పట్టుకొని ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ప్రాణం పోయాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎంతగా ఉద్యమిస్తున్నా “పార్టీని ప్రజలు పట్టించుకోవడం లేదు...భవిష్యత్ అంధకారంగా కనబడుతోంది...మునుగుతున్న ఆ కాంగ్రెస్ టైటానిక్ షిప్పుతో బాటు మేమూ ములిగేందుకు సిద్దంగా లేము,” అంటూ కాంగ్రెస్ నేతలు ఒకరొకరుగా బయటకు దూకేసి వేరే పార్టీలలోకి వెళ్లిపోతూనే ఉన్నారు. ఆ మధ్య ఎప్పుడో రాహుల్ గాంధీ వచ్చి అనంతపురంలో కాస్త హడావుడి చేసి వెళ్లిపోయాక పార్టీ నేతల్లో మళ్ళీ కొంచెం హుషారు వచ్చినట్లు కనబడింది. కానీ ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొత్తిగా పట్టించుకోవడం మానేశారని అటువంటి పార్టీలో ఇంకా కొనసాగి ఏమి ప్రయోజనం అనుకొంటూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసేందుకు విజయవాడ అర్బన్ అధ్యక్షుడు మల్లాది విష్ణు సిద్దం అయిపోయారు.

 

మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైకాపాలో చేరే ముందు ఇదే మాట అన్నారు. మళ్ళీ ఇప్పుడు మల్లాది కూడా అదే ముక్క చెప్పడం చూస్తుంటే రాహుల్ వచ్చి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో మార్పేమీ కనబడలేదని స్పష్టం అవుతోంది. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా చాలా రోజుల క్రితమే వైకాపాలోకి జంప్ అయిపోవాలనుకొన్నారు. కానీ గురువుగారు రాయపాటి బ్రేక్ వేయడంతో ఆగిపోయారు. ఆయన తెదేపాలో చేర్పించేందుకు రాయపాటి ప్రయతిస్తున్నట్లు సమాచారం. మల్లాది విష్ణుకి అలాగా బ్రేకులు వేసేవారెవరూ లేరు కనుక ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి గుడ్-బై చెప్పేసి వైకాపాలోకి వెళ్లిపోబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. మల్లాది తరువాత ఇంకా ఎవరెవరు జంప్ అవుతారో?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu